కేసు కొట్టేసిన న్యాయస్థానం
అమరావతి : అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అతడిపై నంద్యాలలో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్(2024) సమయంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును కొట్టేయాలంటూ అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గత నెల 25న విచరాణకు రాగా.. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబరు 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అంతేగాకుండా ఈ కేసుకు సంబంధించి నవంబరు 6న తుది తీర్పు ఇవ్వనున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
దీంతో నేడు ఈ కేసు విచారణకు రాగా.. అతడిపై ఉన్న కేసును కొట్టివేసింది. అసలు ఏం జరిగిందంటే.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ నంద్యాల శాసనసభ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఇంటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నంద్యాలలో అల్లు అర్జున్, శిల్పా రవి ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులకు రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. ఆర్వో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అల్లు అర్జున్, శిల్పా రవిలపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద ఈ కేసు నమోదు చేశారు. క్రైమ్ నంబర్ 71/2024గా కేసు రిజిస్టర్ చేసినట్టు సమాచారం.