Tuesday, November 26, 2024

నిధులివ్వండి, నిర్మాణాలు కానివ్వండి.. ఢిల్లీ పర్యటనలో మంత్రి శంకరనారాయణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం, నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఢిల్లీ పర్యటన చేపట్టిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి శంకర నారాయణ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి, మార్గాని భరత్‌తో కలిసి కేంద్ర రవాణా, రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో 21 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన 51 ప్రాజెక్టుల భూమిపూజ, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కేంద్రమంత్రిని ఆహ్వానించారు. విజయవాడ తూర్పు బైపాస్, విశాఖ – భోగాపురం ఎయిర్‌పోర్టుకు 6 వరుసల రహదారి, కడప – రేణిగుంట రహదారి నిర్మాణం, నిధుల గురించి కేంద్ర మంత్రికి వివరించారు. అనంతపురం, చిత్తూరుతో పాటు ఇతర జిల్లాల్లోని ముఖ్య అంతర్రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాల్సిందిగా మంత్రి శంకర నారాయణ కోరారు.

రూ.2,200 కోట్లతో అన్ని జిల్లాల్లో చేపట్టనున్న రహదారుల మరమ్మత్తు పనులకు 30 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం, మిగతా నిధులు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ సమకూర్చనున్నాయని కేంద్ర మంత్రికి వివరించారు. సమావేశం అనంతరం శంకర నారాయణ మీడియాతో మాట్లాడుతూ… త్వరితగతిన పనుల పూర్తి, సకాలంలో నిధుల విడుదల, టెండర్ల గురించి తాము చేసిన విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి, సుముఖత వ్యక్తం చేశారని పేర్కొన్నారు. అలాగే ఈనెల 17న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నితిన్ గడ్కరీ విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రాజెక్టులకు భూమి పూజ నిర్వహించి ప్రారంభించనున్నట్టు తెలిపారు. 2018-19లో టీడీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణ పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. రోడ్ల కోసం రూ. 3 వేల కోట్లు అప్పులు తీసుకుని ఆ నిధులను దారి మళ్లించారని విమర్శించారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులు, అభివృద్ధికి రూ. 2,200 కోట్లు ఖర్చు చేస్తున్నామని, పూర్తిగా దెబ్బతిన్న రోడ్లకు మొదట మరమ్మత్తులు చేస్తామని మంత్రి శంకర నారాయణ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement