Friday, November 22, 2024

14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధుల విడుదల.. ఏపీకి రూ.879.08 కోట్లు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ సహా 14 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం జూన్ నెల వాటా రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 14 రాష్ట్రాల రెవెన్యూ లోటును రూ. 86,201 కోట్లుగా లెక్కించిన 15వ ఆర్థిక సంఘం, ఆ లోటును భర్తీ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి తన సిఫార్సుల్లో పేర్కొంది. ఆ మేరకు ప్రతినెలా రెవెన్యూ లోటు నిధులను విడుదల చేస్తున్న కేంద్రం, జూన్ నెల వాటా కింద రూ. 7,183.42 కోట్లు విడుదల చేస్తున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం రూ. 21,550.25 విడుదల చేశామని తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ లోటును రూ. 10,549 కోట్లుగా లెక్కించగా, జూన్ నెల వాటా కింద రూ. 879.08 కోట్లు విడుదలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే నెల వాయిదాలతో కలిపితే ఇప్పటి వరకు రూ. 2,637.25 కోట్లు విడుదలయ్యాయి.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం పన్నుల్లో వాటా లెక్కించిన తర్వాత ఖర్చులకు, ఆదాయానికి మధ్య వ్యత్యాసాన్ని రెవెన్యూ లోటుగా గుర్తించి, ఆ లోటును కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆ లోటు ఎంత అనేది ఆర్థిక సంఘం లెక్కించి రాష్ట్రాల వారిగా కేంద్రానికి సిఫార్సులు చేస్తుంది. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్నట్టు పేర్కొంది. ఈ 14 రాష్ట్రాలకు కలిపి 2020-21 నుంచి 2025-26 వరకు రెవెన్యూ లోటును అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. ఆ మేరకు కేంద్రం ప్రతి నెలా వాటాను విడుదల చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement