Monday, October 7, 2024

AP | మద్యం షాపుల దరఖాస్తులు.. రుసుము చెల్లింపులో సడలింపు

అమరావతి, ఆంధ్రప్రభ : మద్యం షాపుల లైసెన్స్‌ కోసం దరఖాస్తు ఫీజులు చెల్లింపుపై నిబంధనలు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. షాపుల లైసెన్స్‌ కోసం మాన్యువల్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలనుకునే వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు దరఖాస్తు రుసుమును దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వాణిజ్య బ్యాంకు నుంచైనా డీడీ తీసుకునే వెసులుబాటు ఇచ్చారు.

ఏపీలోని వాణిజ్య బ్యాంకులు స్పాన్సర్‌ చేసే ఏదైనా గ్రామీణ బ్యాంకు నుంచి కూడా డీడీ తీసుకోవచ్చు. సీఎఫ్‌ఎంఎస్‌లోని సిటిజన్‌ ఛలానాను సంబంధిత ఖాతాల ద్వారా కూడా తీసుకోవచ్చని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా స్పష్టం చేశారు.

ప్రభుత్వం మద్యం షాపులను మున్సిపల్‌ కమిషనర్‌, మున్సిపాలిటీ, నగర పంచాయితీ, మండలాల వారీగా ఇప్పటికే విభజించింది. ఆ మేరకు సిస్టమ్‌ సీరియల్‌ నంబర్‌ను జనరేట్‌ చేస్తుంది. మాన్యువల్‌ విధానంలో దరఖాస్తు చేసే వారు సంబంధిత దరఖాస్తులో ఛలానా/డీడీ నంబర్‌ను సిస్టమ్‌లో పేర్కొనాలి. వీటిని సంబంధిత ఎక్సైజు శాఖ కార్యాలయంలోని కేంద్రాల్లో దరఖాస్తుతో పాటు ఒరిజినల్‌ ఛలానా/ డీడీలను అందజేయాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement