Thursday, September 12, 2024

AP: విజ‌య‌వంతంగా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల రిహార్స‌ల్స్‌..

ఫుల్ డ్రెస్ స‌న్న‌ద్ధ‌త‌ను ప‌రిశీలించిన రాష్ట్ర‌స్థాయి ఉన్న‌తాధికారులు
(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 15న రాష్ట్ర‌స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఉన్న‌తాధికారుల స‌మ‌క్షంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన ఫుల్ డ్రెస్ రిహార్స‌ల్స్ విజ‌య‌వంత‌మ‌య్యాయి.


రాష్ట్ర డీజీపీ సీహెచ్ ద్వార‌కా తిరుమ‌ల‌రావు, ప్ర‌భుత్వ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ (పొలిటిక‌ల్‌) ఎస్‌.సురేష్ కుమార్‌.. ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న, ఏపీఎస్‌పీ డీఐజీ బి.రాజ‌కుమారి, ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌రబాబు, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ హెచ్ఎం ధ్యాన‌చంద్ర‌, విజ‌య‌వాడ ఆర్‌డీవో బీహెచ్ భ‌వానీ శంక‌ర్ త‌దిత‌రుల‌తో క‌లిసి రిహార్స‌ల్స్‌ను ప‌రిశీలించి సంతృప్తి వ్య‌క్తం చేశారు. 78వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై దిశానిర్దేశం చేశారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్నారు. త్రివ‌ర్ణ శోభిత వేడుక‌లకు సంబంధించి అడిష‌న‌ల్ డీజీపీ (ఎఫ్ఏసీ), ఏపీఎస్‌పీ బెటాలియ‌న్స్‌, ఐజీపీ (శాంతిభ‌ద్ర‌త‌లు) సీహెచ్ శ్రీకాంత్ నోడ‌ల్ అధికారిగా, ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర బాబు పోలీస్ స‌మ‌న్వ‌య అధికారిగా, ప్రోటోకాల్ డైరెక్టర్ ఎం.బాల‌సుబ్ర‌మ‌ణ్యం రాష్ట్ర సమన్వయ అధికారిగా వ్యవహరిస్తారు. ఏఎస్ఆర్ జిల్లా అడిష‌న‌ల్ ఎస్‌పీ కె.ధీర‌జ్ ప‌రేడ్ క‌మాండ‌ర్‌గా, ఏపీఎస్‌పీ 14వ బెటాలియ‌న్ అసిస్టెంట్ క‌మాండెంట్ పీవీ హ‌నుమంతు ప‌రేడ్ సెకండ్‌-ఇన్‌-క‌మాండ్‌గా, ప‌రేడ్ అడ్జుటెంట్‌గా ఏపీఎస్‌పీ 3వ బెటాలియ‌న్ ఆర్ఐ టి.ప్ర‌భాక‌ర్‌రావు వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

- Advertisement -

స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల క‌వాతులో తెలంగాణ స్టేట్ పోలీస్‌, ఏపీఎస్‌పీ రెండో బెటాలియ‌న్ (క‌ర్నూలు), ఏపీఎస్‌పీ మూడో బెటాలియ‌న్ (కాకినాడ‌), ఏపీఎస్‌పీ 11వ బెటాలియ‌న్ (క‌డ‌ప‌), ఏపీఎస్‌పీ 16వ బెటాలియ‌న్ (విశాఖ‌ప‌ట్నం), ఎన్‌సీసీ బాలురు, ఎన్‌సీసీ బాలిక‌లు, ఏపీ సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్‌, ఏపీ ట్రైబ‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్‌, భార‌త్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏపీ రెడ్‌క్రాస్ సొసైటీ, ఏపీ సైనిక‌ల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ బృందాలు పాల్గొన‌నున్నాయి.

బ్రాస్‌బ్యాండ్స్ విభాగంలో క‌ర్నూలు, కాకినాడ‌, విజ‌య‌న‌గ‌రం, మంగ‌ళ‌గిరి, వెంక‌ట‌గిరి, క‌డ‌ప‌, అనంత‌పురం, విశాఖ‌ప‌ట్నం ఏపీఎస్‌పీ బెటాలియ‌న్ల‌తో పాటు మంగ‌ళ‌గిరి ఏపీఎస్‌పీ బెటాలియ‌న్స్ పైప్‌బ్యాండ్‌, ఎస్ఏఆర్ సీపీఎల్ హైద‌రాబాద్ యూనిట్ బ్రాస్‌, పైప్ బ్యాండ్స్ బృందాలు పాల్గొననున్నాయి. స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, న్యాయ‌మూర్తులు, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌భ్ కుమార్ ప్ర‌సాద్, రాష్ట్ర‌, జిల్లాస్థాయి అధికారులు, త‌దిత‌రులు హాజ‌రుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement