ఏపీలో ఎన్నికల వేళ సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. అటు రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. ఇదే సమయంలో ఎన్నికల సంఘం తమకు వచ్చిన ఫిర్యాదులపైన చర్యలు ప్రారంభించింది. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఓటర్ల జాబితాలో అక్రమాల విషయంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు. ఎన్నికల వేళ ఈ నిర్ణయం సంచలనంగా మారుతోంది.
సీఈసీ సంచలనం:
ఏపీలో ఓటర్ల జాబితాలపై ప్రధాన పార్టీలు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేస్తున్నాయి. ఎన్నికల సంఘం ఈ ఫిర్యాదులను పరిశీలిస్తున్న వేళ సంచలన నిర్ణయం తీసుకుంది. 2021లో తిరుపతి ఉప ఎన్నిక సమయంలో అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లు తయారు చేసారని, వారికి నాడు తిరుపతి కార్పోరేషన్ కమిషనర్ గా పనిచేసిన ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపైన ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఎన్నికల సమయంలో ఆయన లాగిన్ ఐడీ ద్వారా దాదాపు 30 వేలకు పైగా ఎపిక్ కార్డుల్ని అక్రమంగా డౌన్ లోడ్ చేసారనే ఫిర్యాదులు ఉన్నాయి. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకు సహకరించారని ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసాయి.
కలెక్టర్ పై సస్పెన్షన్ వేటు:
ఈ ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ వ్యవహారం పై ఎన్నికల సంఘం విచారణ చేసింది. గిరీషా ఎపిక్ కార్డుల్ని డౌన్ లోడ్ చేసిన విషయం ఎన్నికల సంఘం విచారణలో నిర్దారణ అయింది. దానిపై ఇటీవల విజయవాడ లో జరిగిన సమావేశంలో గిరీషాపై కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పుడు ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇతర అధికారులపైనా చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వారి వివరాలు పంపాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది.