Saturday, November 23, 2024

సిక్కోలులో ఎర్రచందనం కలకలం.. 90 దుంగలు పట్టుకున్న అధికారులు

(ప్రభ న్యూస్‌ బ్యూరో) : శ్రీకాకుళం, జిల్లాలోని జి.సిగడాం మండలం బాతువ గ్రామంలోని ఒక తోటలో 90 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. జిల్లాలో ఇంతవరకూ ఎర్రచందనం దుంగలు పట్టుబడిన ఘటనలు జరగలేదు. అటవీప్రాంతాల్లో కూడా ఎక్కడా ఎర్రచందనం మొక్కులు లేకపోవడంతో ఈ ప్రాంతానికి ఎర్రచందనం దుంగలు ఎక్కడి నుండి వచ్చాయన్నది అర్ధకాని ప్రశ్నగా ఉంది. బాతువ గ్రామంలోని పంటపొలాల పక్కన ఉండే ఒక తోటలో ఎర్రచందనం దుంగలు ఉన్నాయన్న సచాచారాన్ని స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో, ఆ శాఖ అధికారి నరేంద్రన్‌తోపాటు, ఇతర సిబ్బంది అక్కడకు వెళ్లి దుంగలను పరిశీలించారు. అయితే ఇవి ఎవరు తీసుకువచ్చారు, ఎక్కడి నుండి వచ్చాయన్న వివరాలు తెలియరాలేదు. ఆదివారం రాత్రికి వాటిని శ్రీకాకుళం జిల్లా అటవీశాఖ కార్యాలయానికి తరలించేందుకు ఆ శాఖ అధికారులు ఏర్పాట్లు చేసారు.

అయితే, పట్టుబడిన ఎర్రచందనం దుంగలపై మాట్లాడేందుకు అటవీశాఖ అధికారులు కూడా మౌనంగా ఉండడం గమనార్హం. ఆ శాఖ అధికారులు ఎవరూ ఫోన్లోకూడా అందుబాటులో లేకపోవడం చూస్తుంటే ఈ ఎర్రచందనం దుంగలు రవాణా వెనుక పెద్దల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టుబడిన వీటి విలువ ఎంత ఉంటుందన్నది కూడా అటవీఅధికారులు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. అయితే, ఇది అటవీశాఖ వ్యవహారం కావడం, నిందితులు ఎవరూ పట్టుబడకపోవడం పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. పూర్తిస్థాయిలో దీనిపై దర్యాప్తు చేస్తే ఈ అక్రమ రవాణా ఎవరు సాగిస్తున్నారన్నంది స్పష్టమవుతుందని స్థానికులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement