తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్) : రెండు కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను తిరుపతి జిల్లాలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇవ్వాల (బుధవారం) ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్నట్లు తమకు కచ్చితమైన సమాచారం వచ్చిందని, దీంతో నిన్న సాయంత్రం చెన్నై హైవే పై శివశక్తి రాజస్థాన్ దాబా వద్ద వాహనాలు తనిఖీ చేపట్టామన్నారు. అదే సమయంలో తిరుపతి నుండి చెన్నై వైపు కారుతోపాటు రెండు లారీలు వెళ్తుండగా అప్రమత్తమైన పోలీసులు వాటిని ఆపడానికి ట్రై చేశారు. పోలీసులను చూసి స్పీడు పెంచి పారిపోతుంటే దాదాపు 21 కిలోమీటర్ల వరకు చేజ్ చేసి పట్టుకున్నట్టు తెలిపారు.
ఈ ప్రయత్నంలో పోలీసులపై దాడిచేసి పారిపోయేందుకు నిందితులు యత్నించారని ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో వాహన డ్రైవర్ తో పాటు 44 మంది కూలీలను పట్టుకున్నారని, ఇద్దరు ప్రధాన నిందితులు పారిపోయారని చెప్పారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. పట్టుబడ్డ ఎర్రచందనం దుంగల విలువ దాదాపు రెండు కోట్ల రూపాయల దాకా ఉంటుందని తెలియజేశారు. లగేజీలో ముసుగులో ఎర్రచందనం రవాణా చేస్తున్నారని వివరించారు.