Tuesday, November 26, 2024

ఎర్రచందనం స్మగ్లింగ్ – ఆరుగురి అరెస్ట్..

అన్నమయ్య, కడప జిల్లాల్లో సోమవారం రాత్రి 23ఎర్రచందనం దుంగలు, మూడు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకుని ఆరుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్సు ఎస్పీ కే. చక్రవర్తి ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ అధ్వర్యంలో ఆర్ఐలు కృపానంద, చిరంజీవులు టీమ్ లు కూంబింగ్ చేపట్టాయి. ఆర్ఎస్ఐ ఆలీబాషా బృందం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు, బాలపల్లి ఈస్ట్ ఫారెస్టు బీట్ పరిధిలో కూంబింగ్ చేస్తుండగా, కొంత మంది ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వారిని చుట్టుముట్టి ముగ్గురిని పట్టుకున్నారు. నవీన్ అనే వ్యక్తి పారిపోయాడు.వీరి నుంచి ఒక మోటారు సైకిల్, 11ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని రైల్వే కోడూరు మండలానికి చెందిన మణికంఠ (28), కోలం వెంకటశేషయ్య (32), కూని వెంకటేశ్వర (21)లుగా గుర్తించారు. ఆర్ఎస్ఐ టి.రాఘవేంద్ర టీమ్ కడప జిల్లా ముత్తుకూరు ఫారెస్ట్ బీట్ పరిధిలో పాతూరు కుంట సమీపంలో కొంతమంది వ్యక్తులు మోటారు సైకిళ్లను పెట్టకుని అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని ప్రశ్నించే సరికి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని చుట్టుముట్టి పట్టుకోగా, వారి సమీపంలో దాచి ఉంచిన ఎర్రచందనం డంప్ ను కనుగొన్నారు. అక్కడ 12ఎర్రచందనం దుంగలు లభించాయి. వీరిని అట్లూరు మండలానికి చెందిన అన్నపు నరసింహులు(39), డబ్బుగోడ్డు లక్ష్మీ నరసయ్య (47), గొర్ల రాము (45)లుగా గుర్తించారు. వీరి నుంచి రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. 23ఎర్రచందనం దుంగలు 299కిలోలు ఉండగా, వాటి ధర దాదాపు రూ.30లక్షలు ఉండవచ్చునని తెలిపారు. రెండు కేసులను సీఐలు చంద్రశేఖర్, బాలకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement