Friday, November 22, 2024

ధర లేక కోల్డ్‌ స్టోరేజీల్లో మగ్గుతున్న మిర్చి

అమరావతి, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పెరిగిన పంట విస్తీర్ణం, ఆశాజనకంగా నూతన ఉత్పత్తులు, తగ్గిన ఎగుమతులు, శీతల గిడ్డంగుల్లో భారీగా నిల్వలు వెరసి మిర్చి ధరల ఘాటు- తగ్గింది. గత సంవత్సరం గిట్టు-బాటు- ధరలు ఉండడంతో ఆంధ్రప్రదేశ్‌ తో పాటు- తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో మిర్చిపంట విస్తీర్ణం భారీగా పెరిగింది. ఈ సంవత్సరం సీజన్‌ ఆరంభంలో ధరలు తక్కువగా రావడంతో కోల్డ్‌ స్టోరేజీలో నిల్వ చేసుకుంటే అన్‌సీజన్‌లో ధరలు బాగా వస్తాయని మిర్చి రైతులు, వ్యాపారులు ఆశించారు. అయితే ధరలు పెరగకపోగా తగ్గడంతో ఈ ఏడాది వారికి నిరాశే మిగిలింది. గత మూడేళ్ల కాలంలో ఏటా ఆగస్టు నుంచి నవంబరు మధ్యలో మిర్చికి అధిక ధరలు వస్తున్నాయి. ఈ ఏడాది సీజన్‌లో వచ్చిన ధరలే అన్‌సీజన్‌లో కూడా వస్తుండడంతో అనేక వ్యయప్రయాసలకోర్చి శీతల గిడ్డంగుల్లో ఎందుకు నిల్వ చేసుకున్నామా… అని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఆసియా ఖండంలోనే గుంటూరు అతిపెద్ద మిర్చియార్డుగా గుర్తింపు పొందింది. దేశవ్యాప్తంగా మిర్చి ధరలు ఇక్కడ నుంచే నిర్ణయించబడతాయి. గుంటూరు మిర్చి యార్డు కేంద్రంగా ఏటా రూ.6 వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. సీజన్‌లో రోజుకు లక్ష నుంచి రెండు లక్షల టిక్కిలు యార్డుకు వస్తాయి. ఫిబ్రవరి నుంచి మే చివరి వరకు సీజన్‌గా పరిగణిస్తారు. ఒకేసారి ఎక్కువ సరుకు రావడం వల్ల వ్యాపారులు ధరలు తగ్గించి కొనుగోలు చేయడం పరిపాటిగా మారింది, దీంతో రైతులు తమ సరుకును కొద్ది నెలల తరువాత విక్రయిం చుకునేలా శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకుంటారు. గుంటూరు పరిసరాల్లోనే దాదాపు 132 కోల్డ్‌ స్టోరేజీల్లో సుమారు కోటి టిక్కిల మిర్చి నిల్వ చేసుకునే అవకాశం ఉంది. గత మూడేళ్లుగా ఏటా సీజన్‌లో క్వింటాలు సగటు- ధర కనిష్టంగా రూ.9 వేలు, గరిష్టంగా రూ.15 వేలు వరకు లభించేది. ఈ ఏడాది కొంత మేరకు ధర తగ్గింది. కనిష్ట ధర రూ.8 వేలు, గరిష్ట ధర రూ.12 వేలు మాత్రమే లభించింది. అన్‌సీజన్‌లో కనిష్ట ధర రూ.12 వేలు, గరిష్ట ధర రూ.14 వేల నుంచి రూ.18 వేల వరకు పలికేది.

ఈ ఏడాది సీజన్‌లో వచ్చిన ధరలే అన్‌ సీజన్‌లోనూ రావడం రైతులను నిరాశ పరుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ నెల పదో తేదీ వరకూ లభించిన ధరలను పరిశీలిస్తే కనిష్ట సగటు- ధర రూ.9 వేలు, గరిష్ట సగటు- ధర రూ.13 వేలు మించలేదు. గత రెండు నెలలుగా యార్డుకు నిత్యం 35 వేల నుంచి 45 వేల మిర్చి టిక్కిలు వస్తున్నాయి. దాదాపు ఐదు నెలల పాటు- శీతల గిడ్డంగుల్లో ఉంచినా ఆశించిన స్థాయిలో ధరలు పెరగడంలేదని రైతులు వాపోతున్నారు. కోల్డ్‌ స్టోరేజీలో నిల్వ ఉంచినందుకు టిక్కికి రూ.500 నిర్వాహకులకు ఫీజు చెల్లించాలి. ఈ ఏడాది నాన్‌ ఎసి ధర కన్నా ఎసి వెరయిటీ- ధర పెద్దగా పెరగలేదని రైతులు చెబుతున్నారు. మిర్చిలో అత్యంత నాణ్యత కలిగిన తేజ, బాడుగ రకం ధర కూడా గరిష్టంగా రూ.14 వేలు మించడం లేదు.

ఈ రెండు వెరైటీ-లకు అన్‌సీజన్‌లో క్వింటాలుకు గరిష్ట ధర రూ.16 వేల నుంచి రూ.18 వేల వరకు వస్తుందని ఆశించారు. రాష్ట్రంలోని మిగిలిన శీతల గిడ్డంగుల్లో మరో 50 లక్షల టిక్కిలు నిల్వ ఉన్నట్టు- అంచనా. డిసెంబరు 15లోగా ఈ నిల్వలన్నీ విక్రయించాల్సి ఉంది. డిసెంబరు చివరి వారం నుంచి తిరిగి కొత్త సీజన్‌ ప్రారంభం కానుంది. ప్రస్తుత సీజన్‌లో పంటలకు పెట్టు-బడులు అవసరం ఉండడంతో శీతల గిడ్డంగుల్లో మిర్చిని విక్రయించక తప్పని పరిస్థితి రైతులకు నెలకొంది. ఇదిలావుండగా, గతంలో చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌ లకు మిర్చి ఎగుమతులు ఉండేవి. కరోనా నేపథ్యంలో ఆ దేశాలకు ఎగుమతులు తగ్గాయి. ఈ ప్రభావం కూడా ధరలపై చూపింది.

- Advertisement -

ఇది కూడా చదవండి.. ఇవ్వాల్టి నుంచే.. టీ20 వరల్డ్‌ కప్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement