Friday, October 18, 2024

Red Alert: దూసుకొస్తున్న తుపాన్‌..

బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం
క్ర‌మంగా బ‌ల‌ప‌డుతూ తీరం వైపు ప‌య‌నం
చెన్నై స‌మీపంలో తీరం దాటే చాన్స్‌
నెల్లూరు, తిరుప‌తి జిల్లాల్లో భారీ వ‌ర్షాలు
ద‌క్ష‌ణ కోస్తా, రాయ‌ల‌సీమ జిల్లాల‌కూ ఎఫెక్ట్‌
ప్ర‌కాశం, అన్న‌మ‌య్య జిల్లాల్లోనూ వాన‌లు
అప్ర‌మ‌త్త‌మైన అధికార యంత్రాంగం
ముంపు ప్రాంతాల్లో ముంద‌స్తు చ‌ర్య‌లు
నెల్లూరులో విద్యా సంస్థ‌ల‌కు సెల‌వు
146 పున‌రావాస కేంద్రాల ఏర్పాటు
వెంక‌ట‌గిరి, నెల్లూరులో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
అధికారుల‌ను హెచ్చ‌రించిన సీఎం చంద్ర‌బాబు
అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచ‌న‌
ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల‌ని ఆదేశాలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, నెల్లూరు:

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారుతోంద‌ని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. దక్షణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిస్తాయని వాతావ‌ర‌ణ శాఖ వెల్లడించింది. ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

- Advertisement -

చెన్నై స‌మీపంలో తీరం దాటే చాన్స్‌..

బుధవారానికి అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉంది. 17వ తేదీన చెన్నై సమీపంలో తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. భారీ వర్షాలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులకు ముందస్తు చర్యలు సీఎం సూచించారు.

అప్ర‌మ‌త్త‌మైన అధికార యంత్రాంగం..

భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో ప్రభుత్వం వరద సహాయ నిధులు విడుదల చేసింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలకు కోటి చొప్పున అత్యవసర నిధులు విడుదల చేసింది. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు, రక్షిత తాగునీరు, ఆహారం, హెల్త్ క్యాంపులు, శానిటేషన్ కోసం అత్యవసర నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ముంపు ప్రాంతాల్లో ముంద‌స్తు చ‌ర్య‌లు..

వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలని ప్ర‌భుత్వం సూచించింది. రహదారులు భవనాలు, మున్సిపల్, పంచాయితీరాజ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహకారంతో రహదారులపై పడిపోయిన చెట్లు, అడ్డంకులు తొలగించాల్సిందిగా సూచనలు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

విద్యా సంస్థ‌ల‌కు సెల‌వు..

అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో రెండో రోజు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మరో రెండు రోజులు పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. భారీ వర్షాల దృష్ట్యా రెండో రోజు కూడా విద్యా సంస్థలకు సెలవు ప్ర‌క‌టించిన‌ట్టు కలెక్టర్‌ వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో 146 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెంకటగిరి, నెల్లూరులో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను అధికారులు సిద్ధం చేశారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement