Tuesday, November 19, 2024

Rebels – కూటమిలో తిరుగుపోట్లు! – పొత్తుల మేళంలో టిక్కెట్ల రగడ

పోటీకి రెడీ అంటున్న రెబల్స్
ఇండిపెండెట్లుగా రంగంలోకి
అధినేత‌ల బుజ్జగింపులు..
అయినా దారికి రాని తమ్ముళ్లు
కూటమి నేతల వరుస భేటీలు
మార్పులు చేర్పులపై చర్చోపచర్చలు
టీడీపీ అధినేత ఒక అడుగు ముందుకు
టిక్కెట్లు రానోళ్లకు పార్టీ రాష్ట్ర కమిటీలో చోటు

(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – ఓటు బ్యాంకు బ్యాలెన్సీల లెక్కలతో.. అధికారం గ్యారెంటీ అని ఏపీలో ప్రతిపక్ష కూటమి ముందస్తు సంబరాల్లో మునిగి తేలుతుంటే.. ఈ కూటమిలో టిక్కెట్ల కొట్లాట అధిష్టానం గుండెల్లో అలజడి రేపింది. టీడీపీ జనసేన, బీజేపీ కూటమిలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. మంటలు రగిలాయి. ఇక తిరుగుబావుటాలు తప్పటం లేదు. ఏపీలో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీయ జిల్లాల్లోనే అసంతృప్తి వాదులు అధిష్టానాలతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయంటే అతిశయోక్తి కాదు. విజయనగరం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకూ అసంతృప్తి వాదులు తమ ఆయుధాలను సిద్ధం చేస్తుంటే.. అసమ్మతివాదులను బుజ్జగించే పనిలో అధిష్టానాలు నిమగ్నమయ్యాయి. మధ్యేయమార్గంగా ఉజ్వలభవిష్యత్తు, ఎమ్మెల్సీ పదవులు, కీలక పదవులతో రెబల్స్నుఊరిస్తున్నారు. కొందరుసరే అంటే మరి కొందరు ససేమిరా అంటున్నారు.

ఉత్తరాంధ్రలో తలపోటు

- Advertisement -

ఇక విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం సీటును జనసేనకు కేటాయించగా అక్కడ లోకం మాధవికి టిక్కెట్టు ఇచ్చారు. దీంతో టీడీపీలో జగడం ప్రారంభమైంది. ఇక్కడ జనసేనకు టిక్కెట్టు ఇవ్వొద్దని టీడీపీ నేతలు పట్టుపడుతున్నారు. పొత్తు ధర్మాన్ని పాటించాలని, అధికారంలోకి రాగానే టీడీపీ నేతలకు మంచి పదవులు ఇస్తామని నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్థానిక నేతలతో మాట్లాడారు. విశాఖపట్నం, అనకాపల్లి ఎంపీ సీట్లపై బీజేపీ ఆశావహులు గోల చేస్తున్నారు. విశాఖపట్నం సీటు కోసం జీవీఎల్ నరసింహారావు పట్టువదలి విక్రమార్కుడిలా ఢిల్లీలో ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నారు.

పశ్చిమలో ..సహాయ నిరాకరణ

ఇక పశ్చిమ గోదావరిలో ఉండి అసెంబ్లీ, నర్సాపురం ఎంపీ స్థానంలో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. సీఎం జగన్నువ్యతిరేకించితెలుగుదేశంపార్టీలోచేరిన సిట్టింగ్ఎంపీరఘురామకృష్ణంరాజువ్యవహారం.. ఇటు టీడీపీలోనూ.. అటు బీజేపీలోను అంతర్గత కుమ్ములాటకు దారి తీసింది. ఉండి సీటుపై అంతక ముందే టీడీపీలో ఇద్దరు రాజుల మధ్య గొడవ జరుగుతుంటే… మధ్యలో రఘురామ పేరు బయటకు రావటంతో ఉండి మండిపోతోంది. పోనీ నర్పాపురం ఎంపీ సీటును ఇవ్వాలంటే బీజేపీ నేతలు మెట్టు దిగటం లేదు. ఇక్కడ టీడీపీ శ్రేణులు మౌన దీక్ష పాటిస్తున్నారు. పోలవరం సీటు విషయంలోనూ టీడీపీ శ్రేణులు కోపంతో రగిలిపోతున్నారు.

కృష్ణాలో కొంప కొల్లేరు

ఇక విజయవాడ పశ్చిమ సీటులో చిచ్చు రేగటంతో అప్పటి వరకూ గంపెడాశలు పెట్టుకున్న జనసేన నాయకుడు పోతిన మహేష్వైసీపీలోచేరిపోయారు. తాజాగా పెడన, అవనిగడ్డ. ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమిలో కుంపటి రాజుకుంటూనే ఉంది. పెడనలో అసంతృప్తి రగులుతోంది. పెడన టికెట్‌ ఆశించిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్.. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో పెడన రాజకీయాలు .. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే జనసేన పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలసౌరి రంగంలోకి దిగారు. బూరగడ్డ వేదవ్యాస్ ను బుజ్జగిస్తున్నారు. కానీ తనకు సీటు ఇస్తానని చంద్రబాబు మోసం చేశారని బూరగడ్డ తీవ్ర మనస్థాపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ తాను పోటీ చేయక తప్పదని గట్టిగా వాదిస్తున్నారు. అవనిగడ్డలో మాజీ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని వ్యవకిరేకిస్తూ.. జనసేన నేతలు రాజీనామాలు చేస్తున్నారు. వారితో చర్చలు జరిపేందుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్‌ను అధిష్టానం రంగంలోకి దించింది. మండలి బుద్దప్రసాద్, మండలి రాజేష్ ఇద్దరూ కలిసి.. జనసేన లోకల్‌ నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారిని బుజ్జగించి.. కలిసి పనిచేసేలా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు తిరువూరు టీడీపీలోనూ ముసలం పుట్టింది. టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మధ్య జగడంగా ఈ వ్యవహారం మారింది. టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ అభ్యర్థిత్వం మార్చాలని కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. కొందరు స్థానిక నేతలు పార్టీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నీని కలిసి అభ్యర్థిని మార్చాలన్నారు. కొలికపూడిని మార్చి శ్రీదేవికి టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే ఇదంతా ఉండవల్లి శ్రీదేవి చేయిస్తున్నట్లు కొలికపూడి వర్గం ఆరోపిస్తుంది. దీంతో అక్కడ కొత్త కుంపటి మొదలైంది.

ప్రకాశం.. నెల్లూరు జిల్లాల్లోనూ

మరోవైపు.. ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు, కందుకూరు టీడీపీలో అసమ్మతి రాజుకుంది. గిద్దలూరు, కందుకూరు అసెంబ్లీ స్థానాల్లో అసంతృప్తి నేతలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. గిద్దలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా ముత్తుముల అశోక్‌రెడ్డిని అధిష్టానం ప్రకటించింది. దీంతో కూటమి నుంచి రెబల్ అభ్యర్థిగాజనసేన నేత ఆమంచి స్వాములు పోటీకి సిద్ధమయ్యారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా కందుకూరు టీడీపీ అభ్యర్థిగా.. ఇంటూరి నాగేశ్వరరావును అధిష్టానం ప్రకటించగా రెబల్ అభ్యర్థిగాఇంటూరి రాజేష్ పోటీకి సిద్ధమయ్యారు.

రాయలసీమలో అసమ్మతి సెగలు..

ఇక, ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి తలనొప్పులు తప్పటంలేదు. టీడీపీ, బీజేపీని అంతర్గత విబేధాలు పట్టిపీడిస్తున్నాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ సమస్యలు ఎదుర్కొంటోంది. బీజేపీ పోటీ చేసిన ఒకే ఒక్క నియోజకవర్గంలో నేతల మధ్య కుమ్ములాటలు బయటపడుతున్నాయి. ఆదోనిలో లుకలుకలు మూడు పార్టీలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. అటు.. ఎమ్మిగనూరులో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఎంతకీ సయోధ్య కుదరటం లేదు. ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, శ్రీశైలంలో టీడీపీకి సమస్యలు ఎదరవుతున్నాయి.. మరోవైపు, కడప జిల్లా రాజంపేట టీడీపీలో అసమ్మతి జ్వాల రగులుతోంది. టికెట్‌ ఆశించిన బత్యాల చెంగల్ రాయుడు.. పార్టీ ప్రకటించిన అభ్యర్థితో ఢీకొడుతున్నారు. పోటీపోటీగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బత్యాల తీరు.. టీడీపీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. అయనకు సద్దిచెప్పే ప్రయత్నం చేసినా.. ఫలితం మాత్రం కనిపించటంలేదు. నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ నేతలు.. పోటాపోటీ ప్రచారాలతో.. తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడ్డారు.

టీడీపీ రాష్ట్ర కమిటీ పదోన్నతులు

జనసేన, బీజేపీతో పొత్తు కారణంగా తమ స్థానాలను కోల్పోయిన తెలుగుతమ్ముళ్లను బుజ్జగించేందుకు టీడీపీ అధినేత కసరత్తు పూర్తి చేసి 49 మంది ఔత్సాహికులకు టీడీపీ రాష్ర్ట నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఇందులో అనంతపురం అర్బన్ నాయకుడు వైకుంఠం ప్రభాకర చౌదరికి ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాను కట్టబెట్టారు. ఉత్తరాంధ్ర నాయకుడు దాడి వీరభద్రరావుకు కేంద్ర కార్యాలయంలో ఎన్నికల సంఘం, పత్రికా సమావేశాల సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు. ఇలా రాష్ర్ట కమిటీలో ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కార్యనిర్వాహక కార్యదర్శులు.. తదితర పదవులను అప్పగించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించగానే ఈ 49 మందికి ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు.. జిల్లా పరిషత్ చైర్మన్ లు గాప్రాధాన్యం ఇస్తామనిపసుపు సేనను ఊరడించారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement