తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున 3:25 నిమిషాలకు తుది శ్వాస విడిచారు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో 1940 జనవరి 20న కృష్ణంరాజు జన్మించారు. కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 183 సినిమాల్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించారు. తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి కేంద్ర మంత్రిగా పనిచేశారు. కృష్ణంరాజు మృతి తెలుగు చిత్ర సీమకు తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ సంతాపం..
ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో ‘ మాజీ కేంద్రమంత్రి..కృష్ణం రాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు.
తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని సీఎం కేసిఆర్ పేర్కొన్నారు.
లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా, దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రేపు అంత్యక్రియలు.. 1966లో ‘చిలకా గోరింక’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి
కృష్ణంరాజు 20 జనవరి 1940లో జన్మించారు. చదువు పూర్తయిన తర్వాత కొన్నాళ్లపాటు జర్నలిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత సినీ రంగంలో అడుగుపెట్టారు. 1966లో వచ్చిన ‘చిలకా గోరింక’ ఆయన తొలి సినిమా. హీరోగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పటికీ విలన్‌గానూ నటించారు. ‘అవే కళ్లు’ సినిమాలో విలన్‌గా చేశారు. 1977, 1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986లో వచ్చిన ‘తాండ్ర పాపారాయుడు’ సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు.
2006లో ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న వంటి సినిమాలు ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఐదున్నర దశాబ్దాల కెరియర్‌లో బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, పెళ్లి కూతురు, మహ్మద్ బిన్ తుగ్లక్, హంతకులు దేవాంతకులు, నీతి నియమాలు, తల్లీకొడుకులు, రారాజు, త్రిశూలం, రంగూన్ రౌడీ, మన ఊరి పాండవులు, కటకటాల రుద్రయ్య, సతీసావిత్రి, పల్నాటి పౌరుషం, తాతామనవడు, టూటౌన్ రౌడీ తదితర 187 సినిమాల్లో నటించారు. సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లోనూ సత్తా చాటారు. గోపీకృష్ణ మూవీస్ పతాకం పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలు నిర్మించారు.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోనూ కృష్ణంరాజు ప్రవేశించారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన అదే ఏడాది నర్సాపురం నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నర్సాపురం నుంచి ఎంపీగా విజయం సాధించారు. వాజ్‌పేయి హయాంలో మంత్రిగానూ పనిచేశారు. కృష్ణంరాజు నటవారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణం రాజు అంత్యక్రియలు సోమవారం జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.