( శ్రీ సత్య సాయి బ్యూరో , ప్రభన్యూస్ ): ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి శ్రీ సత్య సాయి జిల్లాలో సంచలన రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారారు. ముఖ్యంగా జిల్లాలో ఏకైక హిందూపురం లోకసభ స్థానం నుంచి అదేవిధంగా నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు పరిపూర్ణానంద స్వామి విశ్వప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడక ముందు నుంచి కూడా బీజేపీ తరఫున హిందూపురం లోక్ సభ స్థానాన్ని ఆశిస్తూ పరిపూర్ణానంద స్వామి బీజేపీ అగ్ర నేతలకు, అదేవిధంగా బీజేపీ అధినేతకు విన్నవించుకున్నారు.
బీజేపీ , టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడినప్పటికీ హిందూపురం లోకసభ స్థానం తనకేనంటూ పరిపూర్ణానంద స్వామి చెప్పారు. చివరి నిముషంలో బిజెపి హిందూపురం స్థానాన్ని మిత్రపక్షమైన టీడీపీకి వదిలేయడం జరిగింది. దీంతో పరిపూర్ణానంద స్వామి తీవ్ర ఆవేదనకు గురువుతూ ఇందుకు అంతటికి కారణం హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ అంటూ పత్రికా ముఖంగా విమర్శించారు. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా తాను పోటీలో ఉంటే హిందూపురంలో గల 60 వేల మైనార్టీ ఓట్లు తనకు పడకుండా పోయే ప్రమాదం ఉందని బాలకృష్ణ భావించి తన వియ్యంకుడు బావగారైన, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వద్ద మొరపెట్టుకొని, నాకు హిందూపురం ఎంపీ టికెట్ దక్కకుండా చేశారని, పరిపూర్ణానంద స్వామి బహిరంగంగానే ఆరోపించారు. ఇంత నాటకం జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో హిందూపురం లోకసభ అదేవిధంగా అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి, టీడీపీకి అదేవిధంగా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ లకు తన సత్తా ఏమిటో చూపించి, తద్వారా బీజేపీకి సైతం తన బలాన్ని తెలియజేయాలనే లక్ష్యంతో ఉన్నట్లుగా పలువురు భావిస్తున్నారు.