Saturday, November 23, 2024

Tirumala: గ‌రుడ వాహ‌నంపై మ‌ల‌య‌ప్ప సాక్షాత్కారం.. సంబురంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు

తిరుమల (ప్రభన్యూస్): శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శ‌నివారం రాత్రి మ‌ల‌య‌ప్ప‌స్వామి త‌న‌కెంతో ప్రీతిపాత్ర‌మైన గ‌రుడ వాహ‌నంపై భ‌క్త‌కోటికి ద‌ర్శ‌న‌మిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు వెళుతుండ‌గా భక్తుల కోలాటాలు, డ్రమ్స్‌ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహ‌న‌సేవ కోలాహ‌లంగా సాగింది. అన్ని గ్యాల‌రీల వ‌ద్ద స్వామివారిని అటు ఇటు తిప్పుతూ భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌భాగ్యం క‌ల్పించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

కాగా, బ్రహ్మోత్సవాలలో ఆరో రోజైన ఆదివారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు హ‌నుమంత వాహ‌నం, సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్వ‌ర్ణ‌ర‌థం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు గ‌జ‌వాహనంపై శ్రీవారు భక్తులను కటాక్షించనున్నారు. కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి చిన్న‌జీయ‌ర్‌స్వామి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు.లలిత్, ఎపి హైకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement