ఏపీలో రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రణాళిక విభాగంలో సంస్కరణలపై కమిటీ నివేదికను ముఖ్యమంత్రి ఆమోదించారు. సోమవారం సచివాలయంలో మున్సిపల్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సమావేశంలో సమగ్ర చర్చ అనంతరం పట్టణ ప్రణాళిక విభాగంలో సంస్కరణలపై కమిటీ నివేదికను ఆమోదించారు.
అనుమతుల కోసం సింగిల్ విండో విధానం..
సమీక్షా సమావేశం అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. నూతన సంస్కరణల ప్రకారం 15 మీటర్ల ఎత్తు వరకూ భవనాల నిర్మాణాల ప్లాన్‌లకు మున్సిపల్ శాఖ అనుమతి అవసరం లేదని మంత్రి నారాయణ తెలిపారు.
అంతకంటే ఎత్తైన భవన నిర్మాణాలకు లైసెన్సెడ్డ్ సర్వేయర్లు సంబంధిత ప్లాన్ ఆన్‌లైన్‌లో పెట్టి నగదు చెల్లిస్తే అనుమతి వచ్చేస్తుందని వివరించారు. పునాది వేసిన తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు.
దరఖాస్తును అంతా సక్రమంగా ఉందో లేదో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పరిశీలిస్తుందని మంత్రి నారాయణ అన్నారు. ఆన్‌లైన్‌లో సమర్పించిన ప్లాన్ ప్రకారం కాకుండా నిర్మాణ సమయంలో మళ్లీ ఏవైనా అవకతవకలు జరిగితే సర్వేయర్ల లైసెన్స్ రద్దు.. క్రిమినల్ కేసులు నమోదు ఉంటాయని తెలిపారు.
ఈ నిర్ణయం వలన 95 శాతం మంది మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం ఉండదని వెల్లడించారు. గతంలో మాదిరిగా నెలలపాటు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా భవనాల అనుమతులకు డిసెంబర్ 31వ తేదీ నుంచి సింగిల్ విండో విధానం తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
500 చదరపు అడుగులు దాటిన నివాస భవనాలకు సెల్లార్ పార్కింగ్‌కు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అలాగే పదంతస్తుల కంటే ఎక్కువ ఎత్తైన భవనాలలో రీక్రియేషన్ కోసం ఒక అంతస్తు ఉండాలని స్పష్టం చేశారు. లేఆవుట్లలోనూ ఇక నుంచి 9 మీటర్ల రోడ్డును మాత్రమే వదలాలని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.