Friday, November 22, 2024

అద్దంకి భూములకు రియల్‌ రెక్కలు.. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడుగులు

ఒంగోలు, ప్రభన్యూస్‌ : జిల్లాలోని అద్దంకి ప్రాంతంలో ఎయిర్‌ పోర్టు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అద్దంకి ప్రాంతంలో భూములకు రెక్కలు వచ్చాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అద్దంకి ప్రాంతం పై దృష్టి సారించారు. క్రమంగా అద్దంకి ప్రాంతంలో రియల్‌ గద్దలు వాలుతుండటంతో ఈ ప్రాంతంలోని భూముల ధరలు ఆకాశనంటే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎయిర్‌పోర్టు నిర్మించడానికి అద్దంకి మండలం అనువుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అద్దంకి లేదా తిమ్మాయపాలెం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వన్‌ డిస్ట్రిక్ట్‌ – వన్‌ ఎయిర్‌పోర్టు నినాదంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. బోయింగ్‌ విమానాలు సైతం ల్యాండింగ్‌ అయ్యేలా రన్‌ వే అభివృద్ధి చేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలో జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేశారు. అక్కడ అధికారులు వెయ్యి ఎకరాల భూముల్ని గుర్తించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అద్దంకి మండలం అవునుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అద్దంకి లేదా తిమ్మాయపాలెం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

వాస్తవానికి ఈ ప్రాంతం భౌగోళికంగా విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా ఉండటంతో పాటు, అటు చెన్నై-కలకత్తా గ్రాండ్‌ ట్రంక్‌ రోడ్డు ( 16వ నెంబర్‌ జాతీయ రహదారి), చెన్నై- హైదరాబాద్‌లను కలిపే అద్దంకి నార్కెట్‌ పల్లి హైవే రెండింటికి కూడలిగా ఉంటుంది. అంతే కాక ఈ ప్రాంతంలో ఎతైన కొండలు, గుట్టులు లేకుండా భూములు చదునుగా ఉండటం, వదరలు, భూ కంపాలకు వంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం చాలా తక్కువ ఉండడం..ప్రభుత్వ రికార్డుల ప్రకారం గత వంద ఏళ్లలో ఎటువంటి వరదలు లేకపోవడం, గుంటూరుకు ఒక్క గంట.. విజయవాడకు గంటన్నర ప్రయాణ దూరం మాత్రమే కావడంతో ఈ ప్రాంతం గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టు నిర్మాణానికి అనుకూలమని చెప్పాలి. అయితే ఎయిర్‌పోర్టుకు 1,600 ఎకరాలు అవసరం కాగా, ఈ ప్రాంతంలో 109 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉంది. విమానాశ్రయానికి వెయ్యి ఎకరాలు కావాల్సి ఉండటంతో.. ప్రభుత్వ భూమి పోను.. మిగతా 900 ఎకరాల పట్టా భూములను కొనుగోలు చేయాల్సి ఉంది. అదే విధంగా తిమ్మాయపాలెంలో కుంకుపాడు రోడ్డు నుంచి అంజనేయస్వామి విగ్రహం వద్ద నుంచి వెళ్లే డొంక రోడ్డులో 1,400 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. అయితే అద్దంకి- తిమ్మాయపాలెం వద్ద ఒకే చోట 900 ఎకరాల మేర స్థలాలు ఉండటం వల్ల దీన్ని అనువైన ప్రాంతంగా పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా మేదరమెట్ల నుంచి తెలంగాణలోని నార్క ట్‌పల్లికి వెళ్లే మార్గంలోని బలరామకృష్ణపురం, కొరిశపాడు, బొడ్డువానిపాలెం, పరిసర ప్రాంతాల్లో 890 ఎకరాల పట్టా భూములను గుర్తించారు. దీన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇదిలా ఉండగా భూమిని కొనుగోలు చేయాల్సి రావడం కంటే ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్న చోటే విమానాశ్రయం నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని మరో వైపు వాదన వినిపిస్తోంది. కాగా, జిల్లాలోనే ఉన్న దొనకొండ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వినియోగంలో లేని దొనకొండ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడం వల్ల కొత్తగా మరొకటి నిర్మించాల్సిన అవసరం ఉండదని స్థానికులు సైతం సూచిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం కాలంలో ఈ విమానాశ్రయాన్ని నిర్శించారు. 1970 వరకు విమానాలు రాకపోకలు సాగించాయని స్థానికులు చెబుతున్నారు. ఉడాన్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం దీన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించినప్పటికీ..సాధ్యపడలేదు. జిల్లాలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించడానికి బదులుగా ఆవే నిధులతో దొనకొండను అభివృద్ధి చేయవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement