చిట్వేలి, ప్రభన్యూస్: ఒకప్పుడు చిట్వేలి అంటే ఒక మారుమూల మండల కేంద్రం. ఇక్కడికి ఎవరైనా రావాలంటే కష్టంగా ఫీలయ్యే వారు. ఇప్పుడు.. చిట్వేలి అంటే ఓ భూ వ్యాపార కేంద్రం. చిట్వేలిలో భూములు కొనడానికి చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలేగాకుండా హైదరాబాద్ బెంగుళూరువారు కూడా ఎగబడుతున్నారు. ఎందుకంటే.. ఇక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. చిట్వేలి శివార్లలో నెల్లూరు, రైల్వేకోడూరు రోడ్ల జంక్షన్ ప్రాంతంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద అంకణం (40 చదరపు గజాలు) రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షలు పలుకుతోందంటే నమ్మగలరా.. నమ్మాలి.. నమ్మి తీరాలి.
ఎందుకంటే.. చిట్వేలిలో దళారీలు పవర్‌ఫుల్.. ఎవరికి చప్పాల్సిన మాటలు వారికి చెబుతారు. కొనేవారికి ఆ స్థలంగురించి ఆశలు రేపెడతారు.. అమ్ముకునే వారికి ఆస్థలం నష్టదాయకమని నమ్మిస్తారు.. ఒకే స్థలాన్ని రిజిష్ట్రేషన్లు లేకుండానే బేరసారాలు చేసి చేతులు మార్చడంలో దళారీలు దిట్టలనే పేరు సంపాదించుకున్నారు. ఈ విషయంలో పేరుమోసిన ఓ దళారీ ఒకే స్థలంపై ఆ స్థలం ఖరీదుకంటే కమీషనే ఎక్కువగా సంపాదించారనే ప్రచారం సాగుతోంది. చిట్వేలి పట్టణ శివార్లలోని భూముల యజమానులతో సంబంధాలు పెంచుకున్న ఆ దళారీ ఎలాగోలా వారిని ఇరికించుకొని భూ వ్యాపారాన్ని పరుగులు తీయిస్తూ అవకతవకలకు కూడా ఆజ్యం పోస్తున్నాడనే విమర్శలు బలంగా ఉన్నాయి.
10 సంవత్సరాల క్రితం శివారు ప్రాంతాలన్నీ వ్యవసాయ భూములుగా ఉండేవి. దీనిని ఆసరగా చేసుకొన్న కొందరు దళారీలు భూ వ్యాపారానికి తెరలేపారు. చిట్వేలిలో ఎటువంటి వినోద, విలాస సౌకర్యాలు లేకపోయినా ఇక్కడ స్థలం ఉంటే హోదా పెరుగుతుందని ప్రచారం ఉధృతం చేశారు. అధికారులు మాత్రం రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, దళారీల అమ్యామ్యాలకు అలవాటుపడి కళ్లుమూసుకుంటున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వాదాయం కథ దేవుడెరుగు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకుందామనే కొందరు సిబ్బంద ఆక్రమణలకు యధేచ్చగా అనుమతులు జారీ చేస్తున్నారనే విమర్శలున్నాయి.
దీంతో ప్రభుత్వ, గ్రామ పంచాయితీ స్థలాలు ఆక్రమణల పాలౌతున్నాయి. ఈ మధ్యకాలంలో చిట్వేలిలో ఆక్రమణల పర్వం తారాస్థాయికి చేరిందనే అభిప్రాయాలున్నాయి.ఇప్పటికైనా అధికారులు స్పందించి పంటకాలువలను కేటాయించి వాటిని పునరుద్దరించకపోతే చిట్వేలి లోతట్టు ప్రాంతాలు మడుగులుగా మారిపోక తప్పదని పలువురంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily