అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. అదేక్రమంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో సరికొత్త విధానాలు ఆమల్లోకి తీసుకురావడంతో వినియోగదారులకు మరింత ఊరట కలుగుతోంది. గంటల కొద్దీ వేచి ఉండే పరిస్థితి నుండి ఉపశమనం కలుగుతోంది. ఫలితంగా రిజిస్ట్రేషన్ల శాఖలో గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది. గడచిన ఏడాది మార్చి కంటే ఈ ఏడాది మార్చి చివరి నాటికి 35 శాతం అదనపు రిజిస్ట్రేషన్లు నమోదవడం ఇందుకు నిదర్శనం. దీనిద్వారా రూ. వెయ్యి కోట్ల మేర నెలసరి ఆదాయం వచ్చిందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేకానేక పథకాలను రూపొందింస్తోంది. ఈనేపథ్యంలోనే రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. అయితే, 2020 తరువాత మార్కెట్ రివిజన్ అనేది ఇంతవరకూ జరగలేదు. ఇప్పుడు ప్రభుత్వం మార్కెట్ రివిజన్ కార్యక్రమాన్ని తీసుకుని ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ఫలితంగానే రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. దీనికితోడు కొత్త జిల్లాల ఏర్పాటు కూడా దీనికి మరింత ఊతమిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో, 2014-15 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ఆదాయం లక్ష్యం రూ. 3404.53 కోట్లు-కాగా, ఆయేడాది రూ. 2874.44 కోట్లు- మేర ఆదాయం లభించింది. అంటే ఇది నిర్దేశిత లక్ష్యంలో 84.43 శాతంగా నమోదైంది. అదేక్రమంలో 2015-16లో రూ. 3585.12, 2016-17లో రూ.3457.96, 2017-18లో రూ.4242.23, 2018-19లో రూ.4724.75, 2019-20లో రూ.4895.15, 2019-20లో రూ.4895.15 కోట్ల వంతున ఆదాయం లభించింది. అదే 2020-21లో రూ.6336 కోట్ల మేర ఆదాయం లక్ష్యంగా నిర్దేశించుకోగా అందులో రూ. 5399. 41 కోట్ల మేర ఆదాయం లభించింది. ఇది నిర్దేశించిన లక్ష్యంలో 85.22 శాతంగా నమోదైంది. అదే ఈ ఏడాది 2021-22లో రూ.7327.24 కోట్ల లక్ష్యానికిగానూ రూ. 7327 కోట్లమేర ఆదాయం లభించింది. ఇది గడచిన ఏడాది రెవెన్యూ వసూలు రూ. 5399.41 కోట్లతో పోల్చుకుంటే రూ. 2 వేల కోట్లు అదనంగా ఉంది. గడచిన రెండేళ్లలో మార్కెట్ విలువ సవరణ జరగకపోవడంతో ఈమేరకు రిజిస్ట్రేషన్ల శాఖలో ఆదాయం లభించడం శుభపరిణామమని చెబుతున్నారు.
పెరిగిన డాక్యుమెంట్లు :
రాష్ట్ర విభజన సమయం 2104-15 సంవత్సరంలో 13.70 లక్షల డాక్యుమెంట్లు- రిజిస్ట్రేషన్ కాగా, ఈ ఆర్థిక సంవత్సరం 2021-22లో ఆసంఖ్య 20.76 లక్షలకు పెరిగింది. ఇది గత సంవత్సరం 2020-21లో నమోదైన 17.20 లక్షలతో పోలిస్తే ఈ సంవత్సరం 3.56 లక్షలు ఎక్కువ డాక్యుమెంట్లు- రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఈ రిజిస్ట్రర్డ్ డాక్యుమెంట్లలో అధిక భాగం సేల్, సెటిల్‌మెంట్ మరియు తనఖా రిజిస్ట్రేషన్ల నుండే ఉన్నాయి. ఆర్ధిక లావాదేవీలకు చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇ-గవర్నెన్స్ సర్వీస్ లిమిటెడ్ పోర్టల్‌ను తీసుకొచ్చింది. దీనిద్వారా డిజిటల్ డాక్యుమెంట్ ఎక్సిక్యూషన్ (డీడీఈ) పద్దతిలో ఎప్పుడైనా, ఎక్కడినుండైనా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కలిగింది. ఈక్రమంలోనే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మరియు నేషనల్ ఇ-గవర్నెన్స్ సర్వీస్ లిమిటెడ్ మధ్య ఒక అవగాహనా ఒప్పందం కూడా కుదిరింది. దీనివల్ల డిజిటల్ ఇ- స్టాపింగ్‌కు అవకాశం ఏర్పడింది. ఫలితంగా డిజిటలైజ్డ్ డాక్యుమెంట్‌లకు ఫిజికల్ స్టాంప్ లేదా అగ్రిమెంట్ రాయడం, ప్రింటింగ్ కోసం వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది.
స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా:
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డాక్) అనే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ మరియు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమి-టె-డ్ (ఎస్‌సీహెచ్‌ఐఎల్) సంయుక్తంగా ఈ-స్టాంపింగ్ సౌకర్యం ద్వారా ఇ-సైనింగ్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. దీనికోసం ఈ రెండింటితోనూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖతో 2022 మార్చి 17న ఎంవోయూ కుదిరింది. దీనిద్వారా గ్రామ సచివాలయాలలో రిజిస్ట్రేష్రన్ల ప్రక్రియకు మార్గం సుగుమమైంది. ఈక్రమంలోనే ప్రభుత్వం 37 గ్రామ, వార్డు సెక్రటేరియట్‌లను సబ్ రిజిస్ట్రార్ర్ కార్యాలయాలుగానూ, పంచాయతీ కార్యదర్శులను సబ్ రిజిస్ట్రార్ల్రుగా నోటిఫై చేసింది.
పబ్లిక్ డేటా ఎంట్రీ- మాడ్యూల్ (పీడీఈ) :
పబ్లిక్ డేటా ఎంట్రీ- సిస్టమ్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపకల్పన చేశారు. ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉపయోగపడుతోంది. పీడీఈ మాడ్యూల్ సాధారణ ప్రజలతో పాటు- బ్యాంకర్లు, సహకార సంఘాలు మరియు రియల్టర్లు వంటి కస్టమర్లకు అందుబాటు-లో ఉంటుంది. సామాన్య ప్రజలతోపాటు బ్యాంకర్లు, సహకార సంఘాల వారు, రిలయ్ వ్యాపారులు తమ లావాదేవీలకు సంబంధించిన డేటాను పీడీఈ ద్వారా సులువుగా అప్‌లోడ్ చేయవచ్చు. ఫలితంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వేచి ఉండాల్సిన సమయం కూడా గణనీయంగా తగ్గింది. ఆన్‌లైన్‌లో ఈ పీడీఈ ద్వారా నమోదైన వినియోగదారులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వబడుతోంది.
కొత్త కార్యక్రమాలు:
మిస్సర్స్ డబ్ల్యూబీఎస్‌పీ లిమిటెడ్ అనే సంస్థకు రాష్ట్రంలో 1850 నుండి రిజిస్ట్రేషన్ శాఖలోని వివిధ రకాల డాక్యుమెంట్లను డిజిటలైజేషన్ చేసేందుకు ఎల్‌ఓఐ ఇచ్చారు. దీంతో దాదాపు 15 కోట్ల మేర డాక్యుమెంట్లను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. పుణేకు చెందిన ఎన్‌ఐసీ అనే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అప్లికేషన్ కంపెనీ ద్వారా సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో మెరుగైన సేవలందించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిద్వారా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద రిజిస్ట్రేష్రన్ సేవలను మరింత మెరుగ్గా అందించడానికి వీలుకలిగింది. కృష్ణా జిల్లా కంకిపాడు మరియు చిత్తూరు జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రస్తుతం ఈ అప్లికేషన్ పరిశీలనలో ఉంది. రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో ఎదురయ్యే ఇబ్బందులను పరీక్షించేందుకు పైలట్ ప్రాజెక్టు కింద ఈ రెండు కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడి నుండి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ అప్లికేషన్‌ను మరింతగా అభివృద్ధిచేసి పూర్తిస్థాయిలో సేవలందించేలా దీనిని మెరుగుపర్చనున్నారు. ఓటీఎస్ పథకం కింద మార్చి 31 నాటికి గ్రామ, వార్డు సెక్రటేరియట్‌ల ద్వారా పంపిన 4.36 లక్షల డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ల శాఖ రిజిస్టర్ చేసింది. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద సీసీ కెమేరాల ఏర్పాటు ద్వారా పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నారు.