రాజీనామాలు చేయడానికి తాము వెనుకాడటం లేదని, రాష్ట్రం కోసం రాజీనామాకు తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆయన మాట్లాడుతూ… రాజీనామా డిమాండ్ చేసిన జగన్ ఎక్కడున్నారు ? జవాబు కూడా ఇవ్వలేని పరిస్థితిలో జగన్ ఉన్నారన్నారు. తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ జాతీయ భావాలున్న పార్టీ అని తెలుగుదేశం పార్టీ ఎంపీ కే రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆయన మాట్లాడుతూ…దేశం కోసం ఎప్పుడు ఏ సూచన చేయాల్సి వచ్చినా టీడీపీ ముందుంటుందన్నారు. అందుకే జి-20 సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చారన్నారు.
ఈ సందర్భంగా పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని జరుపుకుని.. రానున్న పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాల గురించి చర్చించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను దారి మళ్లిస్తూ, దుర్వినియోగం చేస్తూ, అవినీతికి పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై పార్లమెంటులో కేంద్రం దృష్టికి తీసుకొస్తామన్నారు. ఇలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. తెలుగు ప్రజల సమస్యల కోసం ఎక్కడైనా మాట్లాడే హక్కు ఉందని, కానీ రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం మాట్లాడిన వారి గొంతు నొక్కుతోందన్నారు. అందుకే పార్లమెంటు సాక్షిగా ఈ అంశాలను లేవనెత్తాలని నిర్ణయించామన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఖాతర్ చేయకుండా అక్రమ మైనింగ్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. రాష్ట్ర హక్కుల కోసం వైస్సార్సీపీ చేస్తున్న పోరాటం సంగతి ఏంటో ఆ పార్టీ అధినేత చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా ఎటు పోయిందో చెప్పాలన్నారు. ఎఫ్ ఆర్ బీఎం పరిమితులు దాటి రుణాలు చేస్తూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారన్నారు. వీటన్నింటి గురించి పార్లమెంటులో చర్చతోపాటు పోరాటం కొనసాగుతుందన్నారు.