Friday, September 20, 2024

Reactor Blast – రేపు అచ్యుతాపురం వెళ్లనున్న చంద్ర బాబు

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – అమరావతీ – ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఉదయం అచ్యుతాపురం వెళ్లనున్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో ఈరోజు మధ్యాహ్నం రియాక్టర్ పేలిన ఘటననలో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలతోపాటు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించనున్నారు. ప్రమాద ఘటన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తారు.

ప్రమాద ఘటనపై ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, పరిశ్రమల శాఖ కార్యదర్శి, పరిశ్రమల శాఖ సంచాలకుడు, కార్మిక శాఖ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్, ఎస్డీఆర్ఎఫ్‌తో పాటు జిల్లా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. తీవ్రంగా గాయపడిన 41 మందికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అవసరమైతే క్షతగాత్రులను విశాఖకు లేదా హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని సూచించారు. వెంటనే అచ్యుతాపురం వెళ్లాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని చంద్రబాబు ఆదేశించారు.

ఉన్నతస్థాయి విచారణకు ఆదేశం

ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

నారా లోకేశ్ దిగ్భ్రాంతి

- Advertisement -

రియాక్టర్ పేలి పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం ఇప్పటికే యంత్రాంగాన్ని ఆదేశించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement