Friday, November 22, 2024

సీమ వరద బాధితులను తక్షణమే ఆదుకోండి

రాయలసీమ వరద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంట, ఆస్తి, ప్రాణనష్టం తీవ్రంగా జరిగిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ జిల్లాలలోని పురాతన చెరువలను, మరమ్మత్తులు చేయకపోవడం, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ సరిగా చేపట్టకపోవడం వలన భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహించి చెరువు కట్టలు, సాగునీటి ప్రాజెక్టులు కూడా తెగిపోయాయని తెలిపారు.

అదేవిధంగా పంట చేతికి వచ్చే సమయంలో ఈ భారీ వర్షాల కారణంగా వరి, పత్తి, మిరప, శెనగ,మినుము,  పసుపు, చిరుధాన్యాలు మరియు ఉద్యాన పంటలైన అరటి, బత్తాయి, మామిడి, సపోటా, దానిమ్మ తదితర తోటలు కూడా ద్వంసమై రైతులకు ఈ వరదలు కోలుకోలేని భారీ నష్టాన్ని మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో ముప్పై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారనీ, వంద మందికి పైగా వరద ధాటికి కొట్టుకొని పోయారని ఆయన అన్నారు. అంతేకాకుండా  వేలాదిగా పశువులు, గొర్రెలు, మేకలు వరదలో కొట్టుకొని పోవడమేగాకుండా, ఇంటి సామాగ్రి, గృహోపకరణాలు కొట్టుకుపోయాయనీ, వందలాది గృహాలు నేల మట్టం కావడంతో వుండటానికి నీడ లేక ప్రజలు అనాథలు అయ్యారనీ ఆయన ఆవేదన వెలిబుచ్చారు. తాగునీటి పథకాల పైప్ లైన్లు కొట్టుకుపోవడంతో ప్రజలు తాగునీటికి అలమటిస్తున్నారనీ, వరద తాకిడికి విద్యుత్ స్తంభాలు నేలకొరిగి చాలా గ్రామాలు విద్యుత్ లేక అంధకారంలో ఉన్నాయన్నారు. వరదల వల్ల రహదారులు వంతెనలు తెగిపోయి గ్రామాల మధ్య సంబందాలు  తెగిపోయాయి. ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కు బిక్కు మని సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమ వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాణం నష్టం జరిగినా ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు పరిహారం, వరదలో ఆస్తి నష్టం జరిగిన ప్రతి కుటుంబానికి తక్షణ సహాయం కింద 50 వేల రూపాయాలు, గృహాల నిర్మాణానికి పూర్తిగా ఆర్థిక సహాయం, వర్షాలతో మరియు వరదలతో పంట నష్టానికి ఇన్ పుట్ సబ్సిడితో పాటు పంటల బీమా ద్వారా పూర్తి నష్ట పరిహారం, పశువుల నష్టానికి పూర్తి నష్ట పరిహారం, కోతకు గురైన భూముల పునరుద్ధరణకు ఆర్థిక సహాయం, పంట రుణాలను పూర్తిగా రద్దు చేసి నూతన పంట రుణాలు ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement