Tuesday, November 26, 2024

నెలాఖరులో రాయలసీమ గర్జన ర్యాలీ.. 29న ప్రారంభించేందుకు సన్నాహాలు

అమరావతి, ఆంధ్రప్రభ : రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు వికేంద్రీకరణ అభివృద్ధి, 3 రాజధానుల ఏర్పాటులో భాగంగా ఈనెల 15న నిర్వహించిన విశాఖ గర్జన విజయవంతమవడంతో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. విశాఖ గర్జన విజయవంతం అవ్వడం, వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభించడం పార్టీలో విశ్వాసాన్ని పెంచింది. ఈక్రమంలోనే మూడు రాజధానులకు మద్దతుగా అక్టోబర్‌ 29న తిరుపతిలో విశాఖ గర్జన తరహాలో రాయలసీమ గర్జన ర్యాలీ, సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అయితే, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్రజల నుండి వచ్చిన స్పందనను అదేవిధంగా కొనసాగేలా చూడాలని కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది. ఒకవవైపు సీమాంధ్ర జిల్లాల్లో మూడు రాజధానుల మద్దతు కోరుతూ ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూనే మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆవేడి తగ్గకుండా ఉండేలా వచ్చే నెలలో భోగాపురం విమానాశ్రయం, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు శంకుస్ఠాపన చేసే కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోసం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పటికే ప్రధాని కార్యాలయానికి సమాచారం పింపినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో అటు ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఇటు సీమ జిల్లాల్లోనూ మూడు రాజధానుల అంశంపై వేడి తగ్గకుండా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు సీఎం జగన్‌.

29న తిరుపతిలో ర్యాలీ

ఈనెల 29న తిరుపతిలో రాయలసీమ గర్జన ర్యాలీ నిర్వహించబోతున్నారు. దీనిపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి, పార్టీలోని ఇతర నేతలు రాయలసీమ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో మూడు రాజధానుల ఏర్పాటువల్ల రాయలసీమ అభివృద్ధికి అవకాశం ఉంటుందని నేతలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. రాయలసీమ నాయకులు శ్రీబాగ్‌ ఒడంబడికలోని ప్రతి అక్షరాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా వికేంద్రీకరణ అంశాన్ని, దానివల్ల జరిగే అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జాయింట్‌ యాక్షన్‌ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమం మాదిరిగానే కృష్ణాపురం ఠాణా నుంచి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం సెంటర్‌ వరకు రాయలసీమ గర్జన ర్యాలీ నిర్వహించి అక్టోబర్‌ 29న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించి వికేంద్రీకరణ ఆవశ్యకతను చాటిచెప్పాలని నిర్ణయించారు.

- Advertisement -

మూడుపై స్ఫూర్తి నింపుతున్న నేతలు

వీలైనంత త్వరగా వైజాగ్‌ నుంచి రాష్ట్ర పరిపాలన పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలు, కార్యకర్తలకు స్పష్టం చేశారు. అదే క్రమంలో ముఖ్యమంత్రి ఇటీవల రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల సందర్భంగా కూడా మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులైతే మూడు రాజధానుల మీద ప్రతి రోజూ ప్రకటనలు చేస్తూనే వస్తున్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వ కార్యాలయాలను వైజాగ్‌కు తరలించడం ద్వారా ఎన్నికలకు ముందు పరిపాలన వికేంద్రీకరణ అమల్లోకి వస్తుందని, 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో కృషి చేయాలని సీఎం, సజ్జల వంటి నేతలు పదే పదే కోరుతున్నారు. అందులో భాగంగానే ఇరు ప్రాంతాల్లోనూ వేడి తగ్గకుండా ఉండేలా సమాంతరంగా కార్యక్రమాల నిర్వహణకు ప్లాన్‌చేస్తున్నారు.

మిషన్‌ 175 లక్ష్యంగా అడుగులు

రాష్ట్రంలో రెండోసారి అధికారం చేపట్టాలని ధృఢంగా నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌ ఆమేరకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు పార్టీని గాడిలో పెడుతూనే మరోవైపు పరిపాలనపై పట్టు సాధిస్తూ వస్తున్నారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలకు నిధులు సమకూరుస్తూనే ఆయన ఎన్నికలకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్యేలను వైఎస్సార్‌సీపీ నుంచి సస్పెండ్‌ చేయడం ద్వారా పార్టీ అంతర్గత సమస్యలను పరిష్కరించడం ప్రారంభించారు. గ్రూపిజం మరియు అంతర్గత తగాదాలు మిషన్‌ 175 లక్ష్యాన్ని సాధించే దిశగా పార్టీ ప్రణాళికలు మరియు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగానే రాయలసీమ గర్జన ర్యాలీ రూపుదిద్దుకున్నట్లు స్పష్టంగా అర్ధమౌతోంది . ఇదే తరహాలో మరికొన్ని వ్యూహాలను తెరపైకి తీసుకొచ్చే అవకాశముందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement