కర్నూలు : శ్రీబాగ్ ఒడంబడిక 86వ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 16న నిర్వహిస్తున్న రాయలసీమ హక్కుల దినోత్సవ సభను విజయవంతం చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సమితి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నవంబర్ 16న రాయలసీమ హక్కుల దినోత్సవ సభ నిర్వహణ ఆవశ్యకతను దశరథరామిరెడ్డి వివరించారు. సరిగ్గా 86 సంవత్సరాల క్రితం నవంబర్ 16, 1937లో మద్రాస్ నగరంలో “శ్రీబాగ్” అనే పేరు గల ఇంటిలో రాయలసీమ పత్రం హక్కుల పత్రంపై ఆంధ్ర, రాయలసీమ నాయకులు సంతకాలు చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా సమితి అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తున్నామని, అందులో భాగంగా న్యాయ రాజధాని, సాగునీటి హక్కులు, ప్రాజెక్టుల నిర్మాణాలపై శాసనసభలో ఇచ్చిన హామీలను బొజ్జా ప్రస్తావించారు.
రాయలసీమ ఎడారిగా మారకుండా, ఈ చీకటి చట్టాన్ని అడ్డుకోవడానికి పాలకులపై ఒత్తిడి పెంచే దిశగా నంద్యాల పట్టణం శ్రీనివాసనగర్ లోని రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయం ప్రక్కన నవంబర్ 16న చేపడుతున్న రాయలసీమ హక్కుల దినోత్సవ సభలో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, రైతులు, ప్రజలందరూ పెద్దఎత్తున సభలో పాల్గొని విజయవంతం చేయాలని దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఏరువ రామచంద్రారెడ్డి, వై.యన్.రెడ్డి, కొమ్మా శ్రీహరి, మహేశ్వరరెడ్డి, పట్నం రాముడు, భాస్కర్ రెడ్డి, షణ్ముఖరావు, క్రిష్ణమోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.