Sunday, December 1, 2024

Rayachoti – గ్రామాల‌ను ఆర్ధికంగా బ‌లోపేతం చేయ‌డ‌మే నా లక్ష్యం – ప‌వ‌న్ క‌ల్యాణ్

రైల్వే కోడూరు: రైల్వేకోడూరు: రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం ఆలోచించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గ్రామాలకు ఏం కావాలనేదానిపై చిత్తశుద్ధితో ఆలోచిస్తేనే మంచి జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, స్వర్ణ గ్రామాలు చేసుకోవాలనేదే లక్ష్యమన్నారు. గ్రామాలు పచ్చగా ఉంటే మనమంతా హాయిగా ఉంటామన్నారు.

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లెలో ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరిట నిర్వహించిన గ్రామ సభలో పవన్ పాల్గొని మాట్లాడుతూ, వైసీపీ హయాంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైందని పేర్కొన్నారు. 75 శాతం గ్రామాల్లో వైసీపీకి చెందిన సర్పంచ్‌లే ఉన్నారన్నారు. రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు.. ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధి కోసమే కృషి చేయాలని పవన్‌ పేర్కొన్నారు. దేశానికి వెన్నెముక పంచాయితీ రాజ్ వ్యవస్థ అని పేర్కొన్నారు. స్వర్ణ పంచాయతీల ఏర్పాటే అందరి లక్ష్యమని తెలిపారు.

రాజకీయాలకు అతీతంగానే అభివృద్ధే కూటమి లక్ష్యమన్నారు. దేశభక్తి పంచాయతీల నుంచే రావాలన్నారు. గ్రామస్థాయి నుంచి వచ్చిన నాయకులే జాతీయ స్థాయికి వెళ్లారన్నారు. పంచాయతీ వ్యవస్థ దేశానికి వెన్నెముక అని పవన్ పేర్కొన్నారు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు. పదవులు తనకు అలంకరణ కాదని.. బాధ్యత అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. చంద్రబాబు అపార అనుభవం ఏపీకి అవసరమని పేర్కొన్నారు.

ఏపీని అప్పుల బారి నుంచి తప్పించి.. సంపద సృష్టించేందుకు చంద్రబాబు అనుభవం అవసరమని పవన్ పేర్కొన్నారు. చంద్రబాబు నుంచి నేర్చుకోవడానికి తాను ఎప్పుడూ సిద్ధమన్నారు. ప్రభుత్వ భూముల రక్షణకు సరికొత్త చట్టం తెస్తామన్నారు. ఐదేళ్లలో 20 గ్రామసభలు జరిగేలా చూస్తామని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అవసరమైతే గూండా యాక్టు కూడా తెస్తామన్నారు. గ్రామాల్లో కళాశాలలు, క్రీడా మైదానాలు లేని దుస్థితి నెలకొందని వాపోయారు. ప్రభుత్వ భూములు ఉంటే నిర్మాణాలు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ పరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే వ్యర్థమేనన్నారు. దాతలు ముందుకొస్తే తాను కూడా నిధులు తీసుకొచ్చి.. క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తానని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు.

- Advertisement -

బాధ్యతల నుంచి తాము పారిపోబోమని.. నిరంతరం పని చేస్తామని పవన్ తెలిపారు. అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదని.. గుండెల నిండా నిబద్ధత ఉందన్నారు. చంద్రబాబు అనుభవం ఏపీకి అవసరమని తాను చాలా సభల్లో చెప్పానన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగేది ఒక్క చంద్రబాబేనన్నారు. లక్షల మందికి ఒకటో తేదీనే పెన్షన్లు ఇవ్వగలిగారని చంద్రబాబును పవన్ ప్రశంసించారు. తన కంటే బాగా ఆలోచించగలిగేవాళ్ల వెంట నడిచేందుకు తానెప్పుడూ సంకోచించబోనన్నారు. పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నుంచి ఎంతో నేర్చుకోవాలనే తపను తనకు ఉందన్నారు. ప్రజల కోసం కూలీ మాదిరిగా పనిచేసేందుకు తాను సిద్ధమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గ్రామాలను ఆర్ధికంగా బ‌లోపేతం చేయ‌డమే త‌న ల‌క్ష్య‌మ‌ని,అందుకు గ్రామ స్థాయిలోని అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరారు.

విద్య గురించి మాట్లాడుతూ, ఒక అబ్బాయి చదువుకుంటే తాను మాత్రమే అభివృద్ధి అవుతాడు, ఒక అమ్మాయి చదువుకుంటే కుటుంబం మొత్తం అభివృద్ధి అవుతుంద‌ని ప‌వ‌న్ అన్నారు.. అలాగే పంచాయితీలు బ‌లోపేత గురించి చెబుతూ, ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాల‌నేది త‌న అభిప్రాయం అన్నారు..

సినిమాలు రాజ‌కీయాలు వేరు వేరు

సినిమాలని, రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాన‌న్నారు జ‌న‌సేనాని.. తన‌కు సినిమాలకంటే దేశం ముఖ్యమ‌ని అన్నారు..అలాగే సినిమాలకంటే సమాజం, సినిమాలకంటే గ్రామాల హితం ముఖ్యమ‌ని తేల్చి చెప్పారు.. పదవీ త‌న‌కు అలంకారం కాద‌ని అది బాధ్య‌త అని విన‌మ్రంగా చెప్పారు ప‌వ‌న్ ..

Advertisement

తాజా వార్తలు

Advertisement