Thursday, November 21, 2024

Big story | వ్యవసాయ శాఖలో హేతుబద్ధీకరణ షురూ.. రేషనలైజేషన్‌ పేరిట 2 వేల మంది సిబ్బంది సర్దుబాటు

అమరావతి, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి మానస పుత్రికలుగా ప్రభుత్వం చేత చెప్పబడుతున్న రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె) తగ్గింపునకు కసరత్తు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల వరకు ఆర్‌బికెలను హేతు బద్ధీకరణ చేసేందుకు రంగం సిద్ధం అయింది. ఉన్నవారితోనే పనులు చక్కబెట్టుకుందాం.. కొంచెం కష్టమైనా అందరూ కలిసికట్టుగా పనిచేసి లక్ష్యాలను చేరుకుందాం.’ ఇదీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.

హేతుబద్ధీకరణ పేరుతో వ్యవసాయ శాఖలో ఈ ప్రక్రియ మొదలయ్యేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించి సచివాలయాల్లోని ఖాళీలను భర్తీ చేసేదిలేదన్న విషయం స్పష్టమవుతోంది ఆర్‌బికెల కోసం నియమితులైన అదనపు సిబ్బందిని వేరే కార్యక్రమాలకు తరలించాలని, అవసరమైన చోట సర్దుబాటు చేయాలని వ్యవసాయశాఖ కమిషనరేట్‌ నుంచి కిందికి ఉత్తర్వులు వెళ్లగా తగ్గింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.

కుదింపు కార్యక్రమాన్ని రేషనలైజేషన్‌ (హేతుబద్ధీకర) అన్నారు. నెలకొల్పిన వేల ఆర్‌బికెలను ఎత్తేయడం వలన ఇప్పటి వరకు వాటిలో ఏర్పాటు- చేసిన మౌలిక వసతులకు, స్వంత భవనాల నిర్మాణాలకు సర్కారు ఖర్చు చేసిన కోట్లాది రూపాయలు వృథా అయ్యే అవకాశం వుంది. ఆర్‌బికెల కోసం కొత్తగా నియమించిన విలేజి అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, సెరికల్చర్‌ అసిస్టెంట్ల భవితవ్యం ప్రశ్నార్ధంగా మారింది.

- Advertisement -

విత్తు నుంచి పంటల విక్రయం వరకు వ్యవసాయదారుల అన్ని లావాదేవీలు, ప్రభుత్వ పథకాలు గ్రామాల్లో రైతుల చెంతనేనని వైకాపా ప్రభుత్వం 2020 మేలో ఆర్‌బికెల వ్యవస్థ తీసుకొచ్చింది. ప్రతి గ్రామ సచివాలయానికి అనుబంధంగా ఆర్‌బికె అని చెప్పింది. ఎపి వ్యాప్తంగా 10,778 సెంటర్లను నెలకొల్పింది. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. మూడేళ్ల అనంతరం ఇప్పుడు ఆర్‌బికెల రేషనలైజేషన్‌ అంటూ వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ మార్గదర్శకాలు జారీ చేశారు. అక్టోబర్‌ 15 లోపు ప్రక్రియ పూర్తి కావాలన్నారు.

డిఎఓలు మరో ఒకరిద్దరు అధికారుల సహాయంతో తమ జిల్లాల్లో రేషనలైజేషన్‌ పూర్తి చేయాలన్నారు. అంతలోనే కమిషనరేట్‌లోనే ఆ ప్రక్రియను పూర్తి చేసి ఓకే చేయాలని కిందికి పంపి తిరిగి పైకి తెప్పించుకున్నారు. ప్రస్తుతం కమిషనరేట్‌లో తుది ఖరారు జరుగుతోంది. ప్రక్రియలో హేతుబద్ధత కొరవడిందని ఆరోపణలొస్తున్నాయి. గతంలో ఒక్కో సచివాలయం పరిధిలో ఒక ఆర్‌బికె ఉండగా రేషనలైజేషన్‌ అనంతరం రెండు మూడు సచివాలయాలకు ఒక ఆర్‌బికె అయింది. అర్బన్‌లో, సెమీ అర్బన్‌లో, పెద్ద గ్రామ పంచాయతీలలో ఎన్ని వార్డు సెక్రటేరియట్‌లు ఉన్నా ఒక్క ఆర్‌బికెకే పరిమితం చేశారు.

ఉత్తర్వుల్లో ఒక ఆర్‌బికె పరిధిలో వెయ్యి-1,500 ఎకరాల విస్తీర్ణం ఉండాలని, ఏజెన్సీలో అయితే 600-800 ఎకరాలుగా పేర్కొనగా అందుకు విరుద్ధంగా అత్యధికంగా 3 వేల ఎకరాల వరకు, అతి తక్కువ 600 ఎకరాల కింద పరిధులు నిర్ణయించారు. పంటలతో నిమిత్తం లేకుండా వివిఎ, వివిహెచ్‌, విఎస్‌ఎలను కేటాయించారు. రాష్ట్రం మొత్తమ్మీద 1,500 నుంచి రెండు వేల ఆర్‌బికెలను ఎత్తేయడానికి రంగం సిద్ధం చేశారు. అన్ని హంగులతో ఆర్‌బికెలకు సొంత భవనాల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికి 10,243 బిల్డింగ్‌ల నిర్మాణం మొదలు పెట్టగా, 1,500 వరకు పూర్తయ్యాయి.

మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. సగానికిపైన ఆర్‌బికెలు ఇప్పటికీ అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ప్రభుత్వం నెలల పర్యంతం అద్దెలు బకాయి పడింది. కాగా రేషనలైజేషన్‌లో సొంత భవనం ఉన్న ఆర్‌బికెలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎత్తేసే ఆర్‌బికెల కోసం చేపట్టిన నిర్మాణాలను ఏం చేస్తారనే ప్రశ్న వస్తోంది. అలానే వదిలేస్తే ఖర్చు చేసిన నిధులు నిరుపయోగమవుతాయి. అన్ని ఆర్‌బికెలలో కియోస్క్‌, టివి, కంప్యూటర్లు, విలువైన ఫర్నీచర్‌ ఏర్పాటుకు బాగానే ఖర్చు చేశారు.

ఒక్కొక్క ఆర్‌బికెలో మౌలిక వసతులకు కనీసం రూ.10 లక్షల వరకు వ్యయం చేశారని అంచనా. ఉన్నపళాన వేల ఆర్‌బికెలను ఎత్తేస్తే ఆ పరికరాల పరిస్థితేంటో అర్థం కాకుండా ఉంది. ఆర్‌బికెల కోసం 6,758 వివిఎలు ఉన్నారు. హార్టికల్చర్‌ పంటలు అధికంగా ఉన్న చోట వివిహెచ్‌లు, సెరికల్చర్‌ ప్రాంతాల్లో విఎస్‌ఎలను నియమించారు. ఇంకా కొన్ని అర్‌బికెలలో సిబ్బంది లేరు. ఎఇఒలు, ఎంపిఇఒలను వేశారు. రేషనలైజేషన్‌లో అర్బన్‌ ఆర్‌బికెలలో తప్పనిసరిగా ఎఇఓలు, ఎంపిఇఓలనే వేయాలని నిబంధన పెట్టారు. అదనపు సిబ్బందిని అవసరాలకనుగుణంగా సర్దుబాటు- చేయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement