Saturday, November 23, 2024

ఏపీలో సత్ఫలితాలనిస్తున్న ఇంటింటికీ రేషన్.. 17 వేల మంది యువతకు ఉపాధి..

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాలు ప్రజా సంక్షేమానికి చెరగని ముద్ర వేస్తున్నాయి. చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రేషన్‌ సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం చౌక డిపోల ద్వారా నాణ్యమైన రేషన్‌ బియ్యాన్ని, అది కూడా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తూ వారి ఆకలిని తీరుస్తోంది. దీనిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నాణ్యమైన రేషన్‌ బియ్యమే పేదల పాలిట పరమాన్నమైంది. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన తొలి కేబినెట్‌ సమావేశంలోనే ప్రజలు ఏ రకం బియ్యం తింటున్నారో వాటినే రేషన్‌ దుకాణాల్లో అందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. దానికి అనుగుణంగానే 2019 సెప్టెంబరులో శ్రీకాకుళం జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా నాణ్యమైన బియ్యాన్ని పంపిణీకి శ్రీకారం చుట్టారు. అనంతరం 2021 ఫిబ్రవరి నుండి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం సరఫరా చేయడంతోపాటు రేషన్‌ డోర్‌ డెలివరీ విశానాన్ని కూడా ప్రారంభించారు. ఇప్పుడది దేశంలో వివిధ రాష్ట్రాలకు ఆదర్శనీయంగా మారింది. ఈక్రమంలోనే ఇటీవల పంజాబ్‌లో కొలువుదీరిన ఆప్‌ ప్రభుత్వం ‘ఘర్‌ ఘర్‌ రేషన్‌ యోజన’ పేరుతో లబ్దిదారుల ఇంటికే బియ్యాన్ని పంపిణీ చేస్తుందని ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌సింగ్‌ ప్రకటించారు. మరో 8 రాష్ట్రాలుసైతం ఈ విధానంపై అధ్యయనం చేస్తుండటం విశేషం.

రాష్ట్రంలో 1.45 కోట్ల రేషన్‌ కార్డులు..

రాష్ట్రంలో 1.45 కోట్ల రేషన్‌ కార్డుదారులు ఉన్నారు. వీరికి పంపిణీ చేసేందుకు నెలకు 2.31 లక్షల టన్నుల బియ్యం అవసరం. అయతే, కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేవలం 90 లక్షల కార్డులకు 1.54 లక్షల టన్నుల బియ్యాన్ని ఇస్తుంది. ఇది కూడా సాధారణ బియ్యాన్ని మాత్రమే అందిస్తున్నారు. మిగిలిన కార్డులకు అవసరమైన 77 లక్షల టన్నుల నాణ్యమై బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చులతో కొనుగోలుచేసి పంపిణీ చేస్తోంది. ఇందుకు ప్రభుత్వంపై నెలకు రూ. 344 కోట్ల భారం పడుతోంది. ఇందులో నాణ్యమైన బియ్యాన్ని (సార్టెక్స్‌ చేసి) ఇచ్చేందుకు రూ. 23.08 కోట్లు అదనపు భారాన్ని మోస్తోంది. గత ప్రభుత్వం ఐదేళ్లలో బియ్యం సబ్సిడీపై చేసిన ఖర్చు రూ. 12, 377 కోట్లు అయితే, ఈ ప్రభుత్వం కిలో రూపాయి చొప్పున నాణ్యమైన బియ్యాన్ని ఇస్తూ ఈ మూడేళ్లలోనే రూ. 12,400 కోట్లు సబ్సిడీకి వెచ్చించింది. ఈ ఏడాది మరో రూ. 4300 కోట్ల వరకూ ఖర్చు చేయనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం కింద బియ్యం ఇస్తున్నప్పటికీ వాటి రవాణా, డీలర్‌ కమిషన్‌ తదితర ఖర్చుల కింద ఏడాదికి రూ. 500 కోట్లకుపైగానే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది.

ప్రజలకు దగ్గరై..కష్టాలను దూరంచేసి..

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాసంకల్ప యాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గర నుండి చూసిన వైయస్‌ జగన్‌అధికారంలోకి వచ్చాక లబ్దిదారుల ఇంటి వద్దే నాణ్యమైన రేషన్‌పంపిణీకి శ్రీకారం చుట్టారు. రేషన్‌దుకాణాల్లో గంటల పాటు క్యూలో నిల్చుని రేషన్‌ సరుకులు తెచ్చుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో పాటు ఒక రోజు పనిని వదులుకుని, కూలి పోగొట్టుకోవాల్సి వచ్చేది. ఇటువంటి వారికోసం రూ. 530 కోట్లకుపైగా వ్యయంతో 2021 ఫిబ్రవరి 1న రాష్ట్రవ్యాప్తంగా 9,260 మెబైల్‌ వాహనాలతో రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులోనూ అన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ యువతకు ఉపాధిని కల్పించారు. రేషన్‌ డోర్‌ డెలివరీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వాహనదారుడితోపాటు హెల్పర్ల కింద సుమారు 17 వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. నెలకు 18 రోజులపాటు లబ్దిదారుల ఇళ్లవద్దే రేషన్‌ పంపిణీ చేస్తున్నారు. ఒక్కో వాహనం విలువ రూ. 5.81 లక్షలు కాగా, ప్రభుత్వం 90 శాతం రాయితీ ఇస్తోంది. ఈ వాహనాలను వాడుకున్నందుకు పౌరసరఫరాల శాఖ నెలకు ఆపరేటర్లకు సుమారు రూ.25 కోట్లు చెల్లిస్తోంది. కార్డుదారుల సమక్షంలోసే ఇంటి దగ్గరే సంచులు తెరచి, కచ్చితమైన తూకంతో రేషన్‌ సరుకులు ఇస్తున్నారు. దీంతో కొలతలపై ఫిర్యాదులు తగ్గడంతోపాటు వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఏర్పాటుచేయడంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement