నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని రేషన్ బియ్యం గోదాంలో బియ్యం మాయమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం దందా వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన తరుణంలో… జిల్లాలో 1318 బస్తాల రేషన్ బియ్యం మాయమవడంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ ఆదేశాల మేరకు సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం హెచ్ కొట్టాల గ్రామ సమీపంలో ఉన్న సివిల్ సప్లై గోడౌన్లలో సుమారు 1318 బస్తాలు మాయమైనట్లు అధికారులు వెల్లడించారు. వీటి విలువ దాదాపు 50 లక్షలు ఉంటుందని అధికారుల అంచనా. మాజీ మంత్రి బుగ్గన బంధువుల బంపర్ గోడౌన్లలో 398 బస్తాలు మాయమవ్వగా… మరో ప్రైవేట్ గోడౌన్‌లో 920 బస్తాలు మాయమయ్యాయి.
బియ్యం మాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అధికారులకు తెలిసే ఘటన జరిగిందా?… లేక ఇంకెవరి పాత్రైనా ఉందా?… అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో ఒక్కసారిగా 1318 బస్తాలు మాయమవడం సంచలనం రేపుతోంది. పోలీసుల దర్యాప్తును వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాలు జారీ చేశారు.