Friday, November 22, 2024

మన పేదల బియ్యం పక్కదారి.. పోర్టుల ద్వారా విదేశాలకు ఎక్స్​పోర్ట్​..

ప్రజా పంపిణీ వ్యవస్థ పక్కదారిపడుతోంది. పేదల బియ్యం మళ్లీ దారిమళ్లుతున్నాయి. బియ్యం బకాసురులు కొత్త పంథాను ఎంచుకున్నారు. లబ్దిదారులకు డబ్బు ఆశ చూపి.. బియ్యాన్ని వారి నుంచే తన్నుకు పోతున్నారు. పేదలతో పాటు మధ్య తరగతి వారు కూడా ఆహార భద్రత కార్డుల లబ్ధిదారులుగా ఉండడం అక్రమార్కులకు మరింత కలసి వస్తోంది. వాస్తవంగా మధ్య తరగతి ప్రజలు చౌక బియ్యాన్ని తీసుకోవడానికి ఇష్ట పడడంలేదు. ఒక వేళ తీసుకున్నా వాడుకోవడం లేదన్నది బహిరంగ రహస్యమే. దీంతో వారు కార్డు పై తీసుకున్న బియ్యాన్ని కేజీకి రూ.10 చొప్పున అమ్ముకుంటున్నారు. కొనుగోలు చేసిన బియ్యాన్ని కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవంగా ప్రభుత్వం ఒక కేజీ బియ్యాన్ని కొనేందుకు రూ.23 వరకూ వెచ్చిస్తోంది. కానీ, పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాయితీ పై రూపాయికి కిలో చొప్పున పంపిణీ చేస్తోంది.

ఒంగోలు, ప్రభన్యూస్ : జిల్లాలో చౌక బియ్యం కొనుగోళ్ల దందా అధికంగా సాగుతోంది. పౌరసరఫరాలశాఖ అధికారులు సిబ్బంది కొరత సాకుతో కార్యాలయాలకే పరిమితం కావడంతో.. జిల్లాలో రేషన్‌ బియ్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. క్వింటాళ్ల కొద్దీ అక్రమార్కులు పందికొక్కులా కొల్లగొడుతూ.. భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా జిల్లా సరిహద్దులు దాటించేస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతలదే ప్రధాన పాత్ర అని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే ఈ తతంగాన్ని అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. జిల్లాలో మొబైల్‌ వాహనాల ద్వారా 9,84,767 మంది కార్డు దారులకు ప్రతి కుటుంబానికి 5 కేజీల చొప్పున ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తోంది. అయితే పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యం పక్కదారి పడుతోంది. ఈ బియ్యాన్ని నల్లబజారుకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమాలకు నిలయంగా మారిన కొన్ని రేషన్‌ దుకాణాలు సరికొత్త దందాకు తెరలేపుతున్నారు. అక్రమార్జనకు అలవాడు పడ్డ కొందరు డీలర్లు లబ్ధిదారులకు ఇవ్వాల్సిన బియ్యానికి బదులు డబ్బులు ఇస్తున్నారు. అధికార యంత్రాంగం పర్యవేక్షణ పూర్తిగా కొరవడటంతో రేషన్‌ దుకాణాల్లోనే డీలర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది.

జిల్లాలోని ప్రభుత్వ చౌకధరల దుకాణాల పై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు డీలర్లు ఎండియూ ఆపరేటర్లను మచ్చిక చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో బియ్యానికి ఉన్న డిమాండ్‌కనుగుణంగా బియ్యం కిలో రూ.10 చెల్లిస్తూ.. లబ్ధిదారులు రేషన్‌ దుకాణాలకు వచ్చి బియ్యం తీసుకున్నట్లే తీసుకుని మళ్లీ వారికే విక్రయించడం చాలా కాలంగా జరుగుతున్న తంతే! ఇలా పేదల బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తూ.. కొందరు డీలర్లు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. నెలకు రెండు సార్లు బియ్యం పంపిణీ జరుగుతున్న నేపథ్యంలో పేదల నుంచి నగదుకు ఈ బియ్యాన్ని తీసుకుంటున్నారు. వీటిని కొన్ని రైస్‌ మిల్లులకు తరలిస్తున్నారు. వీటిని వారు కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు.

దొరికితేనే దొంగలు.. లేదంటే దొరలే…

అక్రమార్జనే ధ్యేయంగా రేషన్‌ బియ్యాన్ని రాష్ట్రాలు దాటిస్తున్నారు. దొరికితే దొంగలు.. దొరకకపోతే దొరలు అన్న చందంగా జిల్లాలో పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతోంది. అక్రమార్కులకు ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నా ఎవరికీ పట్టడం లేదు. నిరుపేదలు రెండు పూటలా కడుపునండా తినాలనే లక్ష్యంతో ప్రభుత్వం కిలో బియ్యాన్ని రూపాయికే అందించే ఆహార భద్రత పథకం అధికారుల నిర్లక్ష్యంతో ఆబాసుపాలవుతున్నది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల వైఫల్యం.. అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం పై ప్రజల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

దందా సాగుతుందిలా…

రేషన్‌ బియ్యాన్ని డీలర్లు కొనుగోలు చేసే ముందు..లబ్ధిదారులతో కందిపప్పు, చక్కెర తీసుకునేలా ఒప్పందం చేసుకుంటున్నారు. మొదటగా కిలోకు రూ.10 చొప్పున డబ్బులు ఇస్తామని చెబుతారు. దానికి లబ్ధిదారులు ఓకే అంటే డబ్బులు ఇస్తారు. లేదంటే కందిపప్పు, చక్కెర ఇస్తున్నారు. ఇదంతా డీలర్లు, ఎండియూ ఆపరేటర్లు చేస్తున్న వ్యవహారం. వాస్తవానికి చౌకధర దుకాణాలు నుంచి ఎండియూ ఆపరేటర్లు వాహనాల ద్వారా బియ్యాన్ని మాత్రమే లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ డీలర్లు సబ్సిడీ ద్వారా అందజేస్తున్న బియ్యాన్ని వ్యాపారులకు పెట్టుబడి లేకుండా తక్కువ మొత్తానికి కొనుగోలు చేసి..ఎక్కువ డబ్బుకు ఇతర రాష్ట్రాలో విక్రయించి రూ.కోట్లు అర్జిస్తున్నారు. అయితే, వ్యాపారులకు అధికారులతో సంబంధాలు ఉండడంతో బియ్యం పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. రేషన్‌ బియ్యాన్ని అధికంగా కాకినాడ, కృష్ణపట్నం పోర్టుకు తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో పోలీసుల తనిఖీల్ల క్వింటాళ్ల కొద్ది రేషన్‌ బియ్యం పోలీసులకు పట్టుబడుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. కొత్త పంథాలో బియ్యాన్ని తరలిస్తున్నా..అధికారులకు మాత్రం ఏ మాత్రం పట్టడం లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement