శ్రీకాకుళంలోని అరసవల్లిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి నుంచే వైభోగంగా రథసప్తమి వేడుకలకు అంకురార్పణ జరిగింది. ఉదయం ఏడు గంటల వరకు స్వామి వారి మూలవిరాట్టుకు క్షీరాభిషేకం జరిగింది. స్వామివారికి తొలిపూజ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చేశారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనివార్య కారణాల వల్ల విశాఖ శారదా పీఠం శ్రీ స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోవడంతో ఆలయ అర్చకులు స్వయంగా సేవలను పూర్తి చేశారు.
రథసప్తమి వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లథాకర్ తదితరులు పాల్గొన్నారు. సూర్య స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామి వారిని దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామి వారు నిజరూప దర్శనంతో భక్తులకు సాయంత్రం నాలుగు గంటల వరకు దర్శనం ఇస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి పుష్పాలంకరణ సేవ, సర్వదర్శనం కల్పిస్తారు.
రథసప్తమి వేడుకల సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 600 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఆలయంలో ఇప్పటికే 32 సీసీ కెమెరాలు ఉన్నాయి. డ్రోన్ కెమెరాను వినియోగించనున్నారు. ఉచిత దర్శనంతో పాటు రూ.100, రూ.500 టిక్కెట్లు ద్వారా స్వామి వారిని దర్శించుకోవచ్చు.