Thursday, November 21, 2024

Rates High – బియ్య‌మే బంగార‌మాయే…

కొత్త ఏడాది సామాన్యుడి నెత్తిన బియ్యం రూపంలో పిడుగు పడింది. ప్రస్తుతం దేశంలో సన్న బియ్యం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ధరలు అమాంతం పెరగడంతో సాధ‌ర‌ణ‌, మధ్య తరగతి జనం అల్లాడిపోతున్నారు..
రెండు, మూడు నెలల క్రితం వరకు మామూలుగానే ఉన్న ధరలు ఆకాశాన్నంటాయి. పెరిగిన ధరలతో బియ్యం కొనాలనే ఆలోచన వస్తేనే సామాన్యుడికి చెమటలు పట్టే పరిస్థితులు నెలకొన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే 26 శాతం బియ్యం ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

స‌న్న బియ్యం కిలో రూ.80 మాత్ర‌మే

గతంలో ఒక క్వింటా సన్న బియ్యానికి రకాన్ని బట్టి 4వేల రూపాయల నుంచి 4500 రూపాయల వరకు ఉండగా.. ప్రస్తుతం ఈ ధరలు 7 వేల నుంచి రూ.8 వేల రూపాయలకు పెరిగిపోయాయి. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఒక క్వింటల్‌ బియ్యం ధర 1000 నుంచి 1500 రూపాయలకు పైగా పెరగడం గమనార్హం. కిలో సన్న బియ్యం రకం ప్రస్తుతం మార్కెట్లో 75 నుంచి 80 రూపాయిలకు అమ్ముతున్నారు.. సాధరణంగా జనవరి నెలలో కోతలు పూర్రై కొత్త ధాన్యం మార్కెట్ లోకి వస్తుంది.. దీంతో బియ్యం ధరలు తగ్గుముఖం పడతాయి.. అయితే అందుకు భిన్నంగా ఒక్క‌సారిగా ధ‌ర‌లు రోజు రోజుకి పెర‌గ‌డం విశేషం.
అయితే ఇంతలా బియ్యం ధరలు పెరగటానికి ప్రధాన కారణం వరదల నష్టం వల్ల పంట దిగుబడి తగ్గిపోవడమే అని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

దుడ్డు బియ్యం ధ‌ర‌ల‌కు రెక్క‌లు

స‌న్న బియానికి రెక్క‌లు రావ‌డంతో సాధార‌ణ‌, దుడ్డు ర‌కం బియ్యానికి డిమాండ్ ఏర్ప‌డింది..40 – 45 మ‌ధ్య ఉండే ఈ ర‌కం బియ్యం ద‌ర నేడు ఏకంగా 50 రూపాయిలు దాటేసింది.. దీంతో దుడ్డు బియ్యం తినలేక.. పాత బియ్యం కొనలేక సామాన్యులు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు…

- Advertisement -

రంగంలోకి కేంద్రం…రూ.25 కే అందిచేందుకు ప్ర‌య‌త్నం

కాగా.. ఈ ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఇప్పటికే అన్ని రకాల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది కేంద్రం. అంతేకాదు దేశంలోని ప్రజలకు రాయితీ కింద రూ.25 కే కిలో బియ్యాన్ని ఇవ్వాలని కూడా నిర్ణయించి ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. త్వ‌ర‌లోనే ఎంపిక చేసిన రాష్ట్రాల‌లో కిలో రూ .25 కి ఇచ్చే స్టోర్ ల‌ను ఏర్పాటు చేయ‌నుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement