Friday, November 22, 2024

Rare Fish – మత్స్యకారులకు చిక్కిన “పఫ్పర్‌ ఫిష్” !.

రామాపురంలో మత్స్యకారులకు చిక్కిన అరుదైన చేప
సైనైడ్‌ కంటే ఎక్కువ ప్రమాదకర చేపంటున్న మత్స్యకారులు
ఈ చేపతో జపాన్‌ వంటి దేశాల్లో ప్రత్యేక వంటకాలు
చనిపోవడంతోనే మత్స్యకారుల వలకు చిక్కిన చేప

ఒంగోలు, ప్రభన్యూస్‌ బ్యూరో – బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని రామాపురం సముద్రతీరంలో మత్స్యకారుల వలకు అరుదైన చేప చిక్కింది. ఈ చేపను చూసి మత్స్యకారులు అవాక్కైయ్యారు. ఈ అరుదైన చేపను పఫ్పర్‌ పిష్‌గా పిలుస్తారు. అంతే కాదు ముళ్లపంది చేప అని కూడా పిలుస్తారు. ఈ చేప శరీరంలో విషపూరిత టెట్రోడోటాక్సిన్‌ ఉంటుందని, అది సైనైడ్‌ కంటే ఎక్కువ ప్రమాదకరమని మత్స్యకారులు చెబుతున్నారు. ఇక్కడ అసలు ఈ చేపలను దగ్గరకు కూడా రానివ్వరు. కానీ జపాన్‌ లాంటి దేశాల్లో ఈ చేపతో ప్రత్యేకంగా వంటకాలు కూడా చేయడం గమనార్హం. అయితే దీన్ని వండే వారికి ఏళ్ల తరబడి శిక్షణ ఇస్తారు. ఎందుకంటే ఈ చేపలోని విషపూరిత భాగాలను పూర్తిగా తీసివేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా చాలా ప్రమాదం పొంచి ఉంటుంది.

అయితే ఈ చేప పరిమాణం పెరగడం, అలాగే బంతిలా మారి శ త్రువులకు చిక్కకుండా తప్పించుకోవం దీని ప్రత్యేకతని మత్స్యకారులు చెబుతున్నారు. నీరు, గాలితో నిండి పోయి చేప ఆకారం కొన్ని సందర్బాల్లో గుండ్రటి బంతిలా మారుతుంది. చేపలు పట్టే వ‌ల‌లను సైతం కొరికేస్తుంది. దీంతో వలకు చిక్కిన వెంటనే దీన్ని వల నుంచి మత్స్యకారులు తప్పించేశారు. పోర్కుపైన్‌ ఫి ష్‌గా పిలుచుకునే ఈ ముళ్లపంది చేప బెలూన్‌ ఫిష్‌లాగా కనిపిస్తుంది. కానీ దాని శరీరం బూడిద రంగులో ఉంటుంది. నల్ల మచ్చటలతో తెల్లటి బొట్టుతో ఉంటుంది. దాని శరీరం అంతటా ముళ్లు ఉంటాయి. ఏదైనా ప్రమాదం పొంచిందని భావించినప్పుడు తన శరీరాన్ని బంతిలా మార్చేస్తుంది. శరీరం పై ఉన్న ముళ్లు నిటారుగా నిక్కబొడుచుకుని శత్రువుకు గుచ్చుకునేలా చేస్తుంది. ఎవరూ దీని జోలికి రాకుండా వెళ్లిపోవాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తుంది. ఇది దిబ్బలు, గుహలు, అంచుల దగ్గర ఒంటరిగా జీవిస్తుంది. రాత్రి వేళ వేటాండేందుకు ఇష్టపడుతుంది.

ఇది 36 అంగుళాల వరకు పెరుగుతుంది. కానీ సాధారనంగా 16 అంగుళాల చేపలే ఎక్కువగా మత్స్యకారుల వలకు చిక్కుతాయి. ఈ పోర్కుపైన్‌ ఫిష్‌ ఒక పిరికి జీవి. దీని దగ్గరకు ఎవరైనా వెళితే దూరంగా వెళ్లిపోతుంది. కానీ నీటిలో కొన్ని విషపూరిత చర్మ పదార్దాన్ని స్రవిస్తుంది. కాబట్టి వాటిని సాధారణంగా విషపూరితమైనవిగా పరిగణిస్తారు. దీని శరీరంలో డేంజరస్‌ టెట్రోడోటాక్సిన్‌ ఉంటుందట. అది సైనైడ్‌ కంటే ఎక్కువ విషపూరితమని చెబుతారు. అయితే, అంత డేంజర్‌ అని తెలిసినా, దీనితో చేసే వంటకాలకు కొన్ని దేశాల్లో డిమాండ్‌ ఉంటుంది. విషయంతో కూడిన పార్ట్స్‌ తొలగించిన తర్వాతే పఫ్ఫర్‌ చేపను వండుతారు. జపాన్‌లో పఫ్ఫర్‌ ఫిష్‌తో చేసే ‘ఫుగు’ అనే వంటకాన్ని అక్కడ ఇష్టంగా తింటారు. ఈ వంటకం తయారు చేసే చెఫ్‌లకు ఒక్కోసారి కొన్నేళ్ల పాటు శిక్షణ ఇస్తార ని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement