ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చంద్రబాబు అన్నారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని.. కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు అన్నారు..
తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేశారు రామోజీరావు అని పేర్కొన్నారు చంద్రబాబు.. సమాజ హితం కోసం అనుక్షణం పని చేసిన రామోజీ కీర్తి అజరామరం. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని అన్నారు. మీడియా రంగంలో శ్రీ రామోజీది ప్రత్యేకమైన శకం. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి.. ఎక్కడా తలవంచకుండా విలువలతో రామోజీ తన సంస్థలను నడిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు తన ప్రకటనలో పేర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
ఇక, రామోజీరావు మృతికి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు.. రామోజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన లోకేష్. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతి తెలుగు సమాజానికి తీరని లోటు అన్నారు. ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో రామోజీ పని చేశారు. రామోజీరావు మనకు మార్గదర్శి. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఉద్యమస్ఫూర్తితో పని చేశారు అని పేర్కొన్నారు నారా లోకేష్..
మరోవైపు.. రామోజీరావు మృతికి యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి, కేశినేని చిన్ని, పయ్యావుల, కాల్వ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు సహా పలువురు టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు.
మీడియా దిగ్గజం రామోజీరావు మృతి పట్ల సంతాపం తెలిపిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. తెలుగు రాష్ట్రాలలో సినీ, మీడియా రంగంలో ఎంతోమందికి ఆయన ఆదర్శం.. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రామోజీ రావు కఠోర సాధనతో ఎన్నో అద్భుతాలు సృష్టించారు.. ఆయన లేని లోటు సమాజానికి తీరనిది అని పేర్కొన్నారు.