అమరావతి, ఆంధ్రప్రభ: భారతీయ కుటుంబాలు ఆత్మీయం, అనురాగాలతో పెనవేసుకుని ఉంటాయని, విదేశీయులు సైతం మన కుటు-ంబ వ్యవస్థను చూసి అబ్బురపడడం మనం చూస్తూనే ఉంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శ్రావణ పౌర్ణిమ కోసం మన ఆడపడుచులు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారని, అటు-వంటి మన కుటు-ంబాలలో అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్లు జన్మ బంధంతో రక్షాబంధన్ జరుపుకొంటున్న ఈ ఆనందవేళ సోదర సోదరీమణులందరికీ ప్రేమపూర్వక రాఖి శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు.
అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల ప్రేమానురాగాలు అపురూపమైనవి.., వెల కట్టలేనివని, అవి అనిర్వచనీయమైనవని పేర్కొన్నారు. అక్కగాని చెల్లెలుగాని లేని సందర్భాలలో ఎవరో ఒక ఆడ బిడ్డతో మనం రాఖీ కట్టించుకుంటామని గుర్తు చేశారు. ఇటు-వంటి మన సమాజంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ శుభదినాన యావన్మందికి ఒక విన్నపమని, ఏ ఆడపిల్లయినా సరే మన ఇంటి ఆడపడుచుగా చూడాలని విజ్ఞప్తి చేశారు. వారు నిర్భయంగా జీవించే మార్గాన్ని సుగమం చేయాలని కోరారు. ఈ శ్రావణ పూర్ణిమ భారతీయులందరికీ శుభాలు కలుగచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు-న్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.