అమరావతి – వైసీపీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు. వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావులు అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు ఈ ముగ్గురు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. వీరికి సీఎం బీఫాం అందజేశారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జగన్ పార్లమెంట్ మెట్లు ఎక్కించే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికీ అవకాశం కలిపిస్తున్నారని తెలిపారు. తమకు ఇచ్చిన ఈ అవకాశంతో ముగ్గురం కూడా విజయం సాధిస్తామని అన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మళ్ళీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు అందరు కోరుకుంటున్నారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
గొల్ల బాబురావు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అశీసులతో తాము నామినేషన్ వేసామన్నారు. సమ సమాజం కోసం ఎంత వరకు వెళ్లాలన్నది జగన్ కి మాత్రం సాధ్యమని తెలిపారు. బడుగు బలహీన వర్గాల వారికి పెద్ద పీట వేశారని చెప్పారు. తనలాంటి సామాన్య వ్యక్తులను రాజ్యసభకి పంపిస్తున్న ఘనత జగన్ కి మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175 సీట్లని కూడా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకి, సీఎం జగన్ కి చాలా తేడా ఉంటుంది.. గతంలో చంద్రబాబు ఎస్సీలకు చాలా మందికి అవకాశం ఇవ్వలేదన్నారు. చంద్రబాబు సొంత వర్గం అయిన కనకమేడలని రాజ్యసభకి పంపించారని.. కానీ జగన్ మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
మేడా రఘునాధ రెడ్డి మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. తాము కష్టపడి ప్రజల కోసం పనిచేస్తాం.. అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధించేలా కృషి చేస్తామని ఆయన చెప్పారు.