Tuesday, November 26, 2024

AP | జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డ రాజ్ నాథ్ సింగ్

ఏలూరులో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటించారు. నర్సాపురం, ఏలూరు, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇదిలా ఉంటే పోలవరం కోసం కేంద్రం ఇచ్చే నిధులతో ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఆలోచన ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని ఆరోపించారు. మోడీ చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ ఇచ్చారన్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన వైసీపీకి లేదన్నారు. పెద్ద ఎత్తున నిధులు ఇస్తే ఆ డబ్బు ఎక్కడికి పోతుందని రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు. ఇసుక, మైనింగ్ మాఫియా, మద్యం మాఫియా రాష్ట్రాన్ని లూటీ చేసే విధంగా ఇక్కడి ప్రభుత్వం పనిచేస్తోందని దుయ్యబట్టారు. అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ ప్రభుత్వాన్నా కుటుంబ పాలన బీజేపీ సహించదని అని పేర్కొన్నారు.

తెలుగు బిడ్డ పీవీ నరసింహారావును భారతరత్నతో సత్కరించిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. దేశం పేరు చెబితే గతంలో అంతర్జాతీయ వేదికలపై ఎవరు పట్టించుకునే వారు కాదని… కానీ ఇపుడు మోడీ పేరు చెబితే ప్రపంచ దేశాలు అలెర్ట్ అవుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు ఉండేవి.. బీజేపీ పై ఒక్క అవినీతి ఆరోపణ లేదని పేర్కొన్నారు. దేశంలో మూడోసారి బీజేపీ 370కి పైగా సీట్లు సాధిస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. విరోధులు, ప్రత్యర్థులు మూడోసారి బీజేపీ రాదు అంటున్నారు.. నాలుగోసారి కూడా బీజేపీ వస్తుందని కార్యకర్తలు, ప్రజలు అంటున్నారని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement