Friday, November 22, 2024

AP: మహాకాళి అవతారంలో రాజశ్యామల అమ్మవారు

విశాఖ శ్రీ శారదాపీఠంలో శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారు ఆదివారం మహాకాళి అవతారంలో దర్శనమిచ్చారు. రాక్షస సంహారం కోసం ఉగ్రరూపం ధరించిన అమ్మవారి అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు అమ్మవారి అలంకరణకు హారతులిచ్చి పూజలు చేసారు. విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామల యాగం 8వ రోజు కూడా కొనసాగింది. అలాగే రాజశ్యామల ఆలయంలో శ్రీచక్రానికి 7గంటలపాటు నిర్విరామంగా నవావరణార్చన నిర్వహించారు.

మరోప శ్రీమత్‌ దేవీ భాగవత పారాయణ కూడా కొనసాగింది. డాక్టర్‌ ధూళిపాళ ప్రభాకర కృష్ణమూర్తి రామాయణ ప్రవచనాల్లో భాగంగా వాలి వధ అనే అంశంపై ప్రవచనం ఇచ్చారు. రాజశ్యామలా సమేత చంద్రమౌళీశ్వరులు, పీఠ సంప్రదాయం మేరకు గురువులను ఆరాధిస్తూ ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి పీఠార్చన నిర్వహించారు. స్వరూపానందేంద్ర స్వామి ప్రదోష కాలంలో తాండవమూర్తిని దర్శించి ప్రత్యేకంగా ఆరాధించారు. కుంకుమార్చనలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరై రాజశ్యామల యంత్రాలకు పూజలు చేసారు. ఏపీ నెడ్ క్యాప్ ఛైర్మన్ కేకే రాజు ఉత్సవాల్లో పాల్గొని స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆశీస్సులు అందుకున్నారు.

24న విజయదశమి వేడుకలు..
రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు మంగళవారం విజయదశమితో ముగుస్తాయి. మంగళవారం ఉదయం నుంచి దసరా వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాహన పూజ అనంతరం శమీ వృక్షం వద్ద ఆయుధ పూజ ఉంటుందని స్వాత్మానందేంద్ర స్వామి వివరించారు. రాజశ్యామల, చండీ, వనదుర్గ తదితర యజ్ఞ యాగాదులకు పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలను పొందాలనిపిలుపునిచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement