అదిప్పుడు తుప్పు పట్టింది
హ్యాండిల్ లేదు.. చ్రకాలు లేవు.. ఫెడల్ లేదు
రిపేరు కోసం తంటాలుపడుతున్న బాబు
ఎర్ర చొక్కాలు పో పొమ్మన్నాయి
క్యారేజీపై మాత్రం దత్తపుత్రుడి సవారీ
ఢిల్లీ మెకానిక్‌లు పెదవి విరిచేశారు
ఇక ట్రింగ్ ట్రింగ్ బెల్లు ఒక్కటే దిక్కు
అదే వాళ్ల మాయల మేనిఫెస్టో
కూటమిపై సీఎం జగన్ సెటైర్ల దాడి
ఆంధ్రప్రభ స్మార్ట్, రాజానగరం ప్రతినిధి: 14 ఏళ్లు సీఎంగా పని చేశానన్నాడు. మూడు సార్లు సీఎం అన్నాడు ఈ చంద్రబాబు. ఆయన పేరు ఎత్తితే.. పేదలకు ఒక్కటంటే ఒక్క మంచి పని గుర్తుకు వస్తుందా? బాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ గుర్తుకు వస్తుందా? ఎన్నికల ముందు రకరకాల వాగ్దానాలు చేశాడు. అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చలేదు. ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. అని ఏపీ సీఎం జగన్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజవక వర్గంలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లతో మాటల తూటాలు పేల్చారు. ఈ ప్రచారంలో జగన్ స్వరం మారింది. టీడీపీ, జనసేన, బీజేపీపై సెటైరిక్ మిసైల్స్ సంధించారు. ఇప్పటి వరకూ టీడీపీ, జనసేనను తూర్పారబట్టిన జగన్ ఇక.. బీజేపీపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు , మాయలు, చేస్తుంటారని, ఆయన మోసాలు ఎలా ఉంటాయో… ఒక్కసారి మీ అందరికీ చూపిస్తానని, కూటమి మేనిఫెస్టోను దెప్పిపొడిచారు.
అది తుక్కు సైకిల్.. మనకు అసలే వద్దు
‘‘2019 ఎన్నికల్లో రైతన్నలు, ఆడపడుచులు, అన్ని సామాజిక వర్గాలు.. పల్లె పట్టణ ప్రజలంతా చంద్రబాబు సైకిల్‌ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్ రిపేర్‌కు చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు. ఆ రిపేర్ క్రమంలో ముందు ఎర్ర చొక్కాల దగ్గరకు వెళ్తే.. ఫలితం రాలేదు. ఆ తర్వాత దత్త పుత్రుడ్ని పిలుచుకున్నాడు. తుప్పు పట్టింది.. నేను క్యారేజీ మీద మాత్రమే ఎక్కుతాను. గ్లాస్ పట్టుకుని టీ తాగుతా అని దత్త పుత్రుడు అన్నాడు. ఆ తర్వాత బాబు తన వదినమ్మను ఢిల్లీ పంపించారు. ఆమె ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి సైకిల్ రిపేర్ కోసం మెకానిక్‌ను పిలిపించారు. వాళ్లొచ్చి.. తుప్పు పట్టిన ఆ సైకిల్ని చూశారు. ఆ సైకిల్‌కు హ్యాండిల్ లేదు. సీటు లేదు. చక్రాల్లేవ్. పెడల్ లేదు. ట్యూబ్లుల్లేవ్. మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు. మరి ఇంతలా తుప్పు పడితే ఎలా బాగు చేస్తామయ్యా అని అడిగారు. పిచ్చి చూపులు చూసి బెల్ కొట్టడం మొదలుపెట్టాడు. ఆ ట్రింగ్ ట్రింగ్ బెల్ పేరే అబద్ధాల మేనిఫెస్టో’’ అని చంద్రబాబుపై జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అన్నీ మోసాలే… మాయ మాటలే
‘‘మేనిఫెస్టో పేరుతో ఇదే పెద్ద మనిషి.. ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్ ఇచ్చారు స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి.. ఇంటింటికి పంపించారు. ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా’’ అని జగన్ ప్రశ్నించారు. ₹1,97,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? రైతు రుణమాఫీపై తొలి సంతకం చేస్తానన్నాడు. మరి ₹87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. అక్కా చెల్లెమ్మల పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. చెల్లెమ్మా ఏకంగా ₹14,205 కోట్లు పొదుపు సంఘాలో రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఇందులో ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ₹ 25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ వేశాడా? అని జగన్ ప్రశ్నించారు.
బాబు వస్తే జాబు అన్నాడు.. జాబు వచ్చిందా?
ఇంటింటికీ ఉద్యోగం… ఉద్యోగం ఇవ్వకపోతే ₹ 2వేల నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ ₹ 1,20,000 ఇచ్చాడా?. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? ₹10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా? విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూరును మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? రాజానగరంలో కనిపిస్తోందా? మరి నేను ఒక్కటే అడుగుతున్నాను. ఇదే ముగ్గురు 2014లో వంచించారు.. అయిదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు. అయినా ఇందులో ఒక్కటైనా జరిగిందా? అని తీవ్ర స్వరంతో జగన్ ప్రశ్నించారు.
మళ్లీ మోసానికి ఆ ముగ్గురే..
మళ్లీ ఇదే ముగ్గురు మళ్లీ కూటమిగా ఏర్పడ్డారు. మేనిఫెఫ్లో డ్రామాలాడుతున్నారు. సూపర్ పిక్స్ అంటున్నారు. నమ్ముతార? సూపర్ సెవెన్ అంట నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట, నమ్ముతారా? అక్కా నమ్ముతారా? ఏమ్మా నమ్ముతారా? ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట నమ్ముతారా? ఎన్నికలకు రెండు నెలల ముందు అవ్వాతాతలకు ఇంటికి పెన్షన్ రాకుండా అడ్డుకున్నారు. ఆ బటన్లు నొక్కిన సొమ్ముకూడా రాకుండా కలిసి ఢిల్లీ వాళ్లతో కుట్రలు చేస్తున్నారు. స్వయానా ఒక సీఎం కోర్టుకి వెళ్లి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే స్థాయికి రాజకీయం దిగజారిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
మీ భూ సమస్యలను పరిష్కరిస్తా..
ఈ ప్రాంతంలో భూముల సమస్య గురించి తెలుసు. అధికారంలోకి వచ్చాక ఈ సమస్యను పరిష్కరించి.. మీ ముందుకు మళ్లీ వస్తా.. మీ అందరిని కోరేది ఒక్కటే. జరగబోయే కురుక్షేత్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేలేదు, మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి. రాజానగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా జక్కంపూడి రాజాకి ఓటేయండి.. ఛీటింగ్ కేసుల్లోని వ్యక్తికి ఓటేయకండి. అలాగే.. ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరి శ్రీనివాసులను గెలిపించాలని జగన్ అభ్యర్థించారు.