రాజమహేంద్రవరం : కాతేరు సమీపంలో విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు బుధవారం అర్దరాత్రి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విశాఖ కు చెందిన యువతి మృతిచెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండి బస్సును నిర్లక్ష్యంగా నడపడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
కాగా, క్షతగాత్రులను హుటాహుటిన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే..
విశాఖ నుంచి హైదరాబాద్‌కు బుధవారం రాత్రి కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. రాత్రి వేళ కావడంతో అంతా ప్రశాంతంగా నిద్రపోయారు. ఇదిలా ఉండగా.. రాజమహేంద్రవరం నియోజకవర్గం కాతేరు- కొంతమూరు మధ్య ఉన్న గామన్ వంతెనపై మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేశారు. అయితే దీన్ని గమనించని డ్రైవర్.. బ్రిడ్జిపైకి బస్సు రాగానే ఒక్కసారిగా అపసవ్య దిశలోకి మళ్లించాడు. అప్పుడే ఎదురుగా ద్విచక్రవాహనం రావడంతో దాన్ని తప్పించబోయి బస్సు బోల్తా పడింది.
అయితే ప్రమాదానికి డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే కారణమని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కాగా, అర్దరాత్రి కావడంతో ప్రమాదానికి సంబంధించిన సమాచారం పోలీసులకు తెలిసేందుకు గంటకుపైగా సమయం పట్టింది.సమాచారం అందుకున్న పోలీసులు వారిని రక్షించేందుకు హుటాహుటిన వెళ్లారు. వారి వెంట భారీ క్రేన్‌ను సైతం తీసుకెళ్లారు. దాని సహాయంతో బస్సును పైకి లేపారు.
అయితే దాదాపు చాలామంది ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన హోమిని(21) తల ఛిద్రం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. యువతి చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్‌లో ఉద్యోగ ప్రయత్నాలకు వెళ్తోందని తెలుస్తోంది.
కాగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల హాహాకారాలతో ఈ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో బాధితులను పోలీసులు రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు హుటాహుటిన తరలించారు. ఎస్పీ నరహింహ కిషోర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి పర్యవేక్షించారు.