శ్రీలంక, తమిళనాడు మీదుగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా అక్టోబరు 29 నుంచి వర్షాలు పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులతో ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన సిత్రాంగ్ తుపాను స్థిరంగా కొనసాగుతూ గంటకు 21 కి.మీ వేగంతో ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతోంది.
అయితే.. శ్రీలంక , మధ్య తమిళనాడు మీదుగా ఏర్పడిన అల్పపీడన ధ్రోణి కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురువనున్నాయి. అక్టోబర్ 29 నుంచి వర్షాలు కురిసేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు వర్షాలు తగ్గుముఖం పట్టినా.. రాత్రివేళ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతూ చలి ప్రభావం పెరిగే అవకాశం ఉంది.
ఏపీలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, అదేవిధంగా తెలంగాణలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ, సిత్రంగ్ తుపాను ప్రభావంతో ఇప్పటికే బెంగాల్‌లోని సుందర్బన్ తీరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేసిన ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల కోసం బెంగాల్‌తో పాటు అస్సాంలో రంగంలోకి దిగాయి.
సిత్రాంగ్ తుపాను కారణంగా తెలంగాణలో వర్షాలు ఎక్కువగా లేకున్నా.. చలి తీవ్రత పెరుగుతోంది. తుపాను ప్రభావంతో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ మహానగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదు అయ్యింది. ఉత్తరాది నుంచి గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉండడంతో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.