దక్షిణ భారతదేశం వాతావరణంపై ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే నైరుతి రుతు పవనాలు దక్షిణాదిన విస్తరించడంతో రానున్న నాలుగైదు రోజుల్లో కోస్తాంధ్ర, ఉత్తర కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణాదిన వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. నైరుతి రుతు పవనాల ప్రభావంతో రాగల నాలుగైదు రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ అంచనా వేస్తోంది. వాయువ్య మధ్యప్రదేశ్, బీహార్ ప్రాంతాల్లో తుపాను ఏర్పడే అవకాశాలున్నాయి. ఫలితంగా బీహర్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మద్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్ గఢ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు పడనున్నాయి. జూన్ 12 తరువాత బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన ఉంది.
ఏపీ, తెలంగాణకు అలర్ట్..
రానున్న ఐదు రోజుల్లో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు. జూన్ 8 నుంచి 11 వరకూ కేరళలో , 8, 9 తేదీల్లో కర్నాటకలో 10వ తేదీన తెలంగాణలో అతి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా రానున్న 4-5 రోజుల్లో కోస్తాంధ్ర, ఉత్తర కర్నాటక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక పొంచి ఉంది.