ఊహించినట్టే మూడు రోజులు ముందుగానే ఆదివారం నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. అక్కడి నుంచి మాల్దీవులు, కొమరిన్ ప్రాంతంలో, దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ వరకూ విస్తరించాయి. నైరుతి రుతుపపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్ని తాకి కదులుతున్నాయి. అనుకున్న సమయానికి మే 31 నాటికి దేశంలో కేరళ తీరాన్ని తాకి దక్షిణాదిలో విస్తరించనున్నాయి. ఫలితంగా సకాలంలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాటక వరకూ సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ఆవర్తనం కూడా బలహీనపడింది. అంటే నైరుతి రుతుపవనాల కదలికకు పెద్దగా ఆటంకాలు ఉండకపోవచ్చు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రానున్న మూడ్రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇవాళ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా వీయనున్నాయి.
తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు..
హైదరాబాద్ నగరం ఇవాళ పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. గరిష్టంగా 33 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండవచ్చు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఇవాళ రాత్రి పడే అవకాశముంది. ఇక రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణ పేట, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఏపీలోనూ …
మరోవైపు ఏపీలో కూడా రానున్న మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ద్రోణి బలహీనపడినా ఏపీ, యానాం ప్రాంతంలో ఆగ్నేయంగా గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన ఉంది. అదే విధంగా దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఆ రాష్ట్రాల్లో ఐదు రోజులు హీట్ వేవ్:
ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజులపాటు తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. మంగళవారం నుంచి శుక్రవారం వరకు రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళ వారాల్లో ఉత్తరప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన హీట్ వేవ్ పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది. అలాగే ఈ వారమంతా గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, బీహార్‌లోనూ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని తెలిపింది.