ఏపీ లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆదివారం నాడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, చిత్తూరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిశాయి.
సాయంత్రం 6 గంటల వరకు అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 53.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో పిడుగుపాటుకు రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు మరణించారు.
మరోవైపు ఇవాళ, రేపు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వెల్లడించింది.
మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.