అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తర తమిళనాడు తీరంలో సగటు సముద్రంపై 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీ మధ్యఉండి కొనసాగుతున్నది.
బంగాళాఖాతం మీదుగా దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో ఈశాన్య గాలులు ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి సముద్ర మట్టానికి సగటు 0.9 కి మీ ఎత్తు వద్ద ఉండి బలహీనపడింది. దీని ఫలితంగా శనివారం నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.