దక్షిణ అండమాన్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి మంగళవారం అల్పపీడనంగా మారనుంది. ఇది చెన్నైకి 400 కిలో మీటర్ల దూరంలో ఏర్పడే ఈ అల్పపీడనం.. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ గురువారం తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీనిప్రభావం వచ్చే నాలుగు రోజులు దక్షిణకోస్తా, ఉత్తర తమిళనాడులపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు.
ఈ నెల 11, 12 తేదీల్లో ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.