Friday, November 22, 2024

Big Story: ధర్మవరంలో రైల్వేల స్థలం లీజుకు రెడీ.. ఈ-బిడ్‌కు సెప్టెంబర్‌ 13 తుది గడువు..

తిరుపతి, ప్రభన్యూస్‌ బ్యూరో (రాయలసీమ) : రాయలసీమకు చెందిన సత్యసాయి జిల్లా ధర్మవరం రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్న భూమిని లీజుకు ఇవ్వడానికి కార్యక్రమానికి రైల్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఆర్‌.ఎల్‌.డి.ఎ) సన్నాహాలు మొదలుపెట్టింది. రైల్వేల అభివృద్ది ప్రణాళికలో భాగంగా ధర్మవరం స్టేషన్‌కు వద్ద నున్న 3.5 ఎకరాల విస్తీర్ణం కల స్థలాన్ని 45 ఏళ్లకు లీజు పద్దతిలో ఇవ్వడానికి రంగం సిద్దమైంది. రూ.9.58 కోట్లు అప్‌సెట్‌ ధరగా నిర్ణయించిన అధికారులు ఆ లీజుకు సంబంధించిన ఈ-బిడ్‌లో పాల్గొనడానికి సెప్టెంబర్‌ 13వ తేది తుది గడువుగా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా తమ రైల్వే స్టేషన్ల వద్ద నిరర్దకంగా, నిరుపయోగం ఉన్న విలువైన స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా సంబంధిత స్టేషన్ల ప్రగతికి వినియోగించే అభివృద్ది ప్రణాళికలను భారత రైల్వేల శాఖ రూపొందించింది.

ఆ ప్రణాళికలో భాగంగా ఎంపికచేసిన రైల్వే స్టేషన్లకు చెందిన స్ధలాలను ప్రైవేటు సంస్ధలకు లీజుకు ఇచ్చే బాధ్యతలను తమ అనుబంధ విభాగమైన ఆర్‌.ఎల్‌.డి.ఎ కు అప్పగించింది. అధికారిక సమాచారం ప్రకారం ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో లిలుయా (హౌరా), నిజమాబాద్‌ (తెలంగాణ), వాల్టాక్స్‌ రోడ్‌, ఎగ్మూర్‌ (చెన్నై), భోపాల్‌ (మధ్యప్రదేశ్‌), లుధియానా (పంజాబ్‌), ఆబూ రోడ్‌ (రాజస్దాన్‌), బుసావల్‌ (మహారాష్ట్ర), చౌపలా బరేలి, వారణాసి, గోరక్‌పూర్‌ (ఉత్తరప్రదేశ్‌) స్టేషన్లకు చెందిన స్థలాలను లీజు పద్దతిలో కేటాయించడం పూర్తయింది. తద్వారా రూ. 735 కోట్ల లీజు మొత్తం రైల్వేల శాఖకు లభించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో భోపాల్‌, ఎగ్మూరు, బరేలి, లుధియానా రైల్వే కాలనీలలో రూ. 163 కోట్ల విలువైన అభివృద్ది పనులు కూడా చేపడ్తామని ఆర్‌ఎల్‌డిఎ వైస్‌ ఛైర్మన్‌ వేద్‌ ప్రకాష్‌ దుదేజా వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ధర్మవరం రైల్వే స్టేషన్‌కు సమీపంలో చెన్నై-అనంతపురం జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ 716) వద్ద ఉన్న 3.5 ఎకరాల స్థలాన్ని లీజు పద్దతిలో విక్రయించడానికి ఆర్‌ఎల్‌డిఎ రంగం సిద్దంచేసింది. ఈ మేరకు వేద్‌ ప్రకాష్‌ దుదేజా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పట్టు నగరంగా పేరొందిన ధర్మవరంలోని ఈ స్ధలం వాణిజ్యపరమైన అవసరాలకు ఎక్కువగా ఉపకరిస్తుందని పేర్కొన్నారు. 45 ఏళ్లకు లీజుకు ఇవ్వదలచిన ఈ స్థలాన్ని ఈ బిడ్‌ ద్వారా దక్కించుకోడానికి రూ. 9.58 కోట్లు అప్‌సెట్‌ ధరగా ఆర్‌ ఎల్‌ డిఎ నిర్ణయించింది. లీజుకు తీసుకోడానికి ఆసక్తి కలవారు సెప్టెంబర్‌ 13వ తేదిలోగా ఆన్‌లైన్‌ ద్వారా ఈ-బిడ్‌ ను సమర్పించవచ్చునని అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement