Wednesday, November 20, 2024

రికార్డు సమయంలో రైల్వే భద్రతా పనులు పూర్తి..

అమరావతి, ఆంధ్రప్రభ: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కీలక గోల్డెన్‌ డయాగ్నల్‌ రూట్‌ అయిన ఢిల్లి- చెన్నై మార్గంలో ఆర్‌యూబీ గర్డర్‌ రీప్లేస్‌మెంట్‌ పనులను రికార్డు సమయంలో పూర్తి చేశారు. విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్‌ వద్దనున్న ఆర్‌యూబీ మీదుగా ప్రతి నిత్యం దాదాపు 120 రైళ్లు ప్రయాణిస్తాయి. అటువంటి కీలక మార్గంలో ఉన్న ఆర్‌యూబీ గర్డర్లను మార్చే పనులను విజయవాడ రైల్వే డివిజన్‌ అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని భద్రతా ప్రమాణాలతో చేపట్టారు. అందుకోసం రూ. 4.2 కోట్ల విలువైన భారీ యంత్రాలు, పెద్ద సంఖ్యలో సిబ్బందిని వినియోగించి వేగవంతంగా పనులు పూర్తి చేశారు.

ఈ పనుల కోసం ఈ నెల 13 నుంచి 23వ తేదీ వరకు ట్రాఫిక్‌ను మళ్లించారు. 9.15 మీటర్ల పొడవైన భారీ గర్డర్లను మార్చే క్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇంజనీరింగ్‌ అధికారులు పర్యవేక్షణ నిర్వహించారు. గోల్డెన్‌ డయాగ్నల్‌ మార్గంలో పనులు పూర్తయిన నేపథ్యంలో డీఈఎన్‌ పీవీ రమణారావు మాట్లాడుతూ 40 టన్నుల బరువుండే 4 గర్డర్లను మార్చేందుకు 500, 250 టన్నుల సామర్థ్యం ఉన్న హైడ్రాలిక్‌ క్రేన్లను, వంద మంది సిబ్బందిని వినియోగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం శివేంద్ర మోహన్‌ పనులను విజయవంతంగా నిర్వహించిన సీనీయర్‌ డీఈఎన్‌ ఙ. శాంతారాం, పీవీ రమణారావు, సిబ్బందిని అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement