Friday, November 22, 2024

పార్సిల్‌ ఆదాయంలో రైల్వే రికార్డ్‌.. 200 కోట్లు ఆర్జించిన దక్షిణ మధ్య రైల్వే

అమరావతి, ఆంధ్రప్రభ: రైల్వే పార్సిల్‌ ఆదాయంలో దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డును సాధించింది. 2020- 21 సంవత్సరంలో పార్సిల్‌ విభాగంలో వార్షికాదాయం మొత్తం రూ.108.3 కోట్లు కాగా కోవిడ్‌ 19 మహమ్మారి వల్ల సవాళ్లు ఉన్నప్పటికీ.. వాటిని అధిగమించి ప్రస్తుత 2021- 22 ఆర్థిక సంవత్సరంలో(మార్చి 19వ తేదీ వరకు) పార్సిల్‌ విభాగంలో4.78 లక్షల టన్నుల లోడింగ్‌ నిర్వహించి రూ. 200 కోట్ల ఆదాయాన్ని జోన్‌ సాధించింది. అడ్వాన్స్‌ బుకింగ్‌ సౌకర్యం, నిర్ణీత సమయానికే పార్సిల్‌ రైళ్లు నడపడం వంటి వినియోగదారుల స్నేహపూర్వక వివిధ విధానాలతో ఈ లక్ష్యాన్ని అందుకోవడం సాధ్యమైంది. డివిజినల్‌, జోనల్‌ స్థాయిలో ఏర్పాటు చేసిన బిజినెస్‌ డెవలప్మెంట్‌ యూనిట్లు (బీడీయూ) బృందాల విశేష కృషితో పార్సిల్‌ విభాగంలో మెరుగైన ఫలితాలు వచ్చాయి. రాయితీలు కల్పించడం ద్వారా రోడ్డు మార్గంలో జరిగే ఎపార్సిల్‌ రవాణానూ రైల్వేకు మళ్లించడం వంటి చర్యలు ఆదాయ వృద్ధికి తోడ్పడ్డాయి. అలాగే రైల్వే మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన కిసాన్‌ రైళ్ల ద్వారా వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను దేశ వ్యాప్తంగా నామమాత్రపు కనీస చార్జీతో రవాణా చేయగలుగుతున్నారు. దూద్‌ దురంతో(ప్రత్యేకంగా పాల రవాణా కోసం) రైళ్ల ద్వారా నిత్యావసరమైన పాలను దేశ రాజధాని న్యూఢిల్లీకి రవాణా చేయడం జరుగుతోంది.

ఈ అంశాలన్నీ కలిసి జోన్‌ పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఆదాయం నమోదు చేయడానికి ఉపయోగపడ్డాయి. జోన్‌ పరిధిలో 473 కిసాన్‌ ప్రత్యేక రైళ్ల ద్వారా 1.57 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసి, రూ.72.67 కోట్ల ఆదాయాన్ని పొందింది. దూద్‌ దురంతో రైళ్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 7.22 కోట్ల లీటర్ల పాలను తరలించి, రూ.34.03 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ మొత్తం కోవిడ్‌ ముందు జరిగిన పాల సరఫరా కన్నా సగటున రెండింతలు ఎక్కువ. వీటికి అదనంగా, నాన్‌ లీజ్డ్‌ ట్రాఫిక్‌ నుంచి రూ.73.62 కోట్ల ఆదాయం వచ్చింది. ఇవి కాక, 62 ఎస్‌ఎల్‌ఆర్లు, 5 పార్శిల్‌ వ్యాన్లలో స్పేస్‌ లీజింగ్‌ ద్వారా రూ.20.08 కోట్ల ఆదాయం సాధించింది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజీవ్‌ కిశోర్‌ జోన్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మెరుగైన పార్సిల్‌ ఆదాయాన్ని సాధించడంలో కృషి చేసిన జోనల్‌, డివిజినల్‌ ఆపరేటింగ్‌, కమర్షియల్‌ విభాగాల బృందాలను అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement