వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసలైన ప్రజా నాయకుడు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దివంగత నేత, మాజీ సీఎం వైఎస్సార్ 75వ జయంతి సందర్భంగా రాహుల్ నివాళులర్పించారు. ఈ మేరకు ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా వీడియో రిలీజ్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు. ప్రజానీకానికి ఆయన నిజమైన నాయకుడు. ఎప్పుడూ ప్రజల కోసమే బతికిన నేత. ఏపీ, భారతదేశ ప్రజల అభ్యున్నతి, సాధికారతపై ఆయన చూపిన అంకితభావం, నిబద్ధత ఎంతో మందికి మార్గదర్శకం.
వైఎస్సార్ బతికి ఉంటే..
ఆయన ఇప్పుడు బతికే ఉంటే ఏపీ ముఖచిత్రం వేరేలా ఉండేది. కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావు. వైఎస్‌ఆర్ వారసత్వాన్ని షర్మిల సమర్థంగా ముందుకు తీసుకెళ్తోంది. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. వైఎస్‌ఆర్‌లో ఉన్న ధైర్యం, సిద్ధాంతాలు, నాయకత్వ లక్షణాలు షర్మిలలో చూశాను’ అని చెప్పుకొచ్చారు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి తాను వ్యక్తిగతంగా చాలా నేర్చుకున్నట్లు చెప్పారు. భారత్ జోడో యాత్రకు రాజశేఖర్ రెడ్డి పాదయాత్రే స్ఫూర్తి అని ఈ సందర్భంగా రాహుల్ పేర్కొన్నారు. నాడు రాజశేఖర్‌రెడ్డి ఎండను, వర్షాన్ని లెక్క చేయకుండా పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తితోనే భారత్ జోడో యాత్రను చేపట్టినట్లు ఈ సందర్భంగా తెలిపారు.