మడకశిర, ప్రభ న్యూస్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. గత నాలుగేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన, కర్ణాటక అసెంబ్లిd ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారానికి సిద్ధమయ్యారు. రాజకీయాల్లోకి పునప్రవేశం గురించి ఆయనే స్వయంగా ప్రకటన చేశారు. మంగళవారం పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని భావించాను. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ సోనియా కుటుంబంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుండటం నన్నెంతగానో బాధించింది. అకారణంగా రాహుల్‌గాంధీపై తప్పుడు కేసులతో వేధిస్తున్నారు. అతనిపై రెండేళ్లు శిక్షపడేలా వ్యవహరించారు. కోర్టు తీర్పు వచ్చీరాగానే ఉద్దేశపూర్వకంగా అతని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దుచేశారు. చివరకు నివాస బంగళాను కూడా ఖాళీ చేయించారు. ఈ పరిణామాలు నన్ను తీవ్రంగా కలచివేశాయి. ఇలాంటి సమయంలో వారికి, పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని రఘువీరా చెప్పుకొచ్చారు. అదేవిధంగా రాజకీయ కక్ష సాధింపునకు దిగుతున్న బీజేపీకి బుద్ధిచెప్పాలని అన్నారు.
కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం..
కర్ణాటక ఎన్నికల్లో ప్రచారబాధ్యతలు చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. ఆయన విజ్ఞప్తి మేరకు సరిహద్దు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తాను. నాకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తాను. 1989 నుండి కర్ణాటక రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 10 నుండి 12 నియోజకవర్గాలలో మనం ప్రచారం నిర్వహించడం రివాజుగా వస్తున్నది. మడకశిర, హిందూపురం, కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రాంతానికి వెళ్లి ప్రచారం నిర్వహించి అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిద్దాం. సిరా, పావగడ, కొరటికేరే మధుగిరి, చిత్రదుర్గం, తుంకూరు, బాగేపల్లి, గౌరీ బిందూరు, తదితర ప్రాంతాలలో ప్రచారంలో పాల్గొందాం. కాంగ్రెస్‌ను గెలిపించాల్సిందిగా మన బంధువులు, స్నేహితులు, తెలుగు ప్రజలను అభ్యర్థిద్దాం. మే 10వ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుందాం. ఇందుకు మీరంతా కృషిచేయాలి అని పార్టీ శ్రేణులకు రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని, ఇక్కడి నుంచే బీజేపీ పతనం మొదలవుతుందని ఆయన జోస్యంచెప్పారు.
పార్టీ శ్రేణుల విజ్ఞప్తికి సానుకూలత..
మడకశిర, కళ్యాణదుర్గం, హిందూపురం, పెనుగొండ ప్రాంతాలకు చెందిన పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనేతలంతా రఘువీరాను తిరిగి రాజకీయాల్లోకి రావాలని ముక్తకంఠంతో చెప్పారు. మేధావుల మౌనం దేశానికి మంచిది కాదని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి పునరాగమనంపై స్పష్టత ఇవ్వాలని వారంతా డిమాండ్ చేశారు. లేదంటే మడకశిర పట్టణంలోని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద నిరాహారదీక్ష చేస్తామని తమ నేతకు సూచించారు. అనంతరం అభిమానులు, పార్టీ శ్రేణుల అభ్యర్థనకు రఘువీరా సానుకూలంగా స్పందించారు. మీ అందరికోసం, పార్టీకోసం క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని, కర్ణాటక అసెంబ్లిd ఎన్నికల ప్రచారంతో పునరాగమనాన్ని చాటుతానని వెల్లడించారు. తమ నాయకుడి ప్రకటనతో పార్టీ కార్యకర్తలు హర్షధ్వానాలు చేశారు. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషిచేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, హిందూపురం పార్లమెంట్ ఇంచార్జ్ కేటీ- శ్రీధర్, బాలాజీ మనోహర్, గంగల వాయిపాలెం ప్రభాకర్ రెడ్డి, నరసింహమూర్తి, ఈశ్వరప్ప, సొరంగాల నాగరాజు, మంజునాథ, మందలపల్లి నాగరాజు, గురుమూర్తి, లోకేష్, గౌడప్ప,రాంభూపాల్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.